రష్యాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. యుద్ధ ఖైదీలతో వెళ్తోన్న సైనిక విమానం ప్రమాదవశాత్తూ కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని బెల్గోరాడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉక్రెయిన్‌కు చెందిన 65 మంది యుద్ధ ఖైదీలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాల్లో ఎగురుతున్న రష్యా సైన్యానికి చెందిన ఐఎల్-76 విమానం ఒక్కసారిగా అదుపుతప్పి.. భూమిని ఢీకొట్టడం ఈ వీడియోలో కనిపిస్తోంది. విమానంపై పైలట్ నియంత్రణ కోల్పోవడం వల్ల నివాస ప్రాంతాలకు సమీపంలో కూలిపోవడం వీడియోలో కనిపిస్తోంది. విమానం కుడి రెక్కపై కూలిపోయి మంటలు చెలరేగాయి.
‘స్థానిక కాలమానం ప్రకారం దాదాపు ఉదయం 11 గంటల సమయంలో ఐఎల్-76 యుద్ధ విమానం బెల్గోరోడ్ ప్రాంతంలో కూలిపోయింది’ అని రష్యా రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘విమానంలో 65 మంది ఉక్రెయిన్‌కు చెందిన యుద్ధ ఖైదీలు ఉన్నారని, సైనికులు మార్పిడి కోసం బెల్గోరోడ్ ప్రాంతానికి తీసుకెళ్తున్నాం.. విమానంలో ఆరుగురు సిబ్బంది, ముగ్గురు ఎస్కార్ట్‌లు ఉన్నారు’ అని పేర్కొంది.
విమానంలో యుద్ధ ఖైదీలు ఉన్నారని రష్యా పేర్కొంది. అయితే, ఉక్రెయిన్‌లోని స్థానిక మీడియాను ఉటంకిస్తూ యుద్ధ ఖైదీలతో పాటు క్షిపణులు తీసుకువెళుతున్నందున రక్షణ దళాలు విమానాన్ని కూల్చి వేసినట్లు నివేదించింది. బెల్గోరోడ్ రాజధానికి ఈశాన్యంలో కొరోచన్స్కీ జిల్లాలో ఈ ప్రమాదం జరిగిందని ప్రాంతీయ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ టెలిగ్రామ్‌లో తెలిపారు.
‘ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. అత్యవసర సేవలు, భద్రతా బృందం పనిచేస్తున్నాయి.. నేను నా పర్యటన షెడ్యూల్ మార్చుకున్నాను. అక్కడకు వెళ్లాను’ అని గ్లాడ్కోవ్ చెప్పారు. కాగా, రష్యా- ఉక్రెయిన్ మధ్య దాదాపు రెండేళ్లుగా యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం కారణంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా అత్యధికంగా శరణార్ధుల ముప్పును ఎదుర్కొంటోంది.