పంటలకు కనీస మద్దతు ధరను కల్పించే చట్టాన్ని అమలు చేయకపోవడంతో పాటు దేశంలో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఫిబ్రవరి 16న రైతులు భారత్ బంద్ నిర్వహించనున్నట్లు రైతు నాయకుడు, భారత్ కిసాన్ యూనియన్(బికెయు) జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ తికాయత్ ప్రకటించారు. వ్యాపారులు, రవాణా సంఘాల నాయకులను కూడా తమ ఆందోళనకు మద్దతు తెలియచేసి ఒకరోజు సమ్మెలో పాల్గొనవలసిందిగా కోరినట్లు తికాయత్ తెలిపారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్లో ఆయన విలేరులతో మాట్లాడుతూ ఫిబ్రవరి 16న జరిగే భారత్ బంద్‌లో సంయుక్త కిసాన్ మోర్చ(ఎస్‌కెఎం)తోసహా అనేక రైతు సంఘాలు పాల్గొంటాయని తెలిపారు. రైతులు ఆ రోజున పొలానికి వెళ్లకుండా సమ్మె చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో కూడా అమావాస్య నాడు రైతులు తమ పొలాలకు వెళ్లకుండా, పని మానేశారని అలాగే వచ్చే ఫిబ్రవరి 16 కూడా రైతులకు మాత్రమే అమావాస్య అని ఆయన పేర్కొన్నారు.
ఆ రోజున రైతులకు పొలాలకు వెళ్లకుండా వ్యవసాయ సమ్మె చేయాలని ఆయన కోరారు. ఇది దేశానికి గొప్ప సందేశాన్ని ఇవ్వగలదని ఆయన అభిప్రాయపడ్డారు. తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని వ్యాపారులను కూడా కోరుతున్నామని, ప్రజలు కూడా ఆ రోజున ఎటువంటి కొనగోళ్లు చేయరాదని ఆయన పిలుపునిచ్చారు. రైతులు, కార్మికులకు మద్దతుగా ఫిబ్రవరి 16న తమ దుకాణాలను మూసివేయవలసిందిగా ఆయన వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు.
సమ్మె పిలుపు ఇవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. పంటలకు కనీస మద్దతు హామీపై చట్టం అమలుకాకపోవడం, నిరుద్యోగం, అగ్నివీర్ పథకం, పెన్షన్ పథకం వంటివి తమ సమ్మెకు ప్రధాన కారణాలని తికాయత్ వివరించారు. ఇతర రంగాలకు చెందిన సంఘాలు కూడా సమ్మెలో పాల్గొంటున్నందున ఇది కేవలం రైతుల భారత్ బంద్ మాత్రమే కాదని ఆయన తెలిపారు.