రోజూ మనం తింటున్న బియ్యం, గోధుమలు ఓ రకంగా విషపు ఆహారంగా మారిపోయాయి. శరీరానికి ఎంతో అవసరమైన జింక్, ఐరన్ వంటి పోషకాల స్థానంలో ఆర్సెనిక్ వంటి విష పదార్థాలు వచ్చి చేరడమే దీనికి కారణం. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ఐసీఏఆర్) పరిశోధకులు, ‘డౌన్ టు ఎర్త్’ మ్యాగజీన్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
గడిచిన 50 ఏండ్ల వ్యవధిలో భారత్లో పండిస్తున్న బియ్యంలో జింక్ పోషకాలు 30 శాతం మేర తగ్గుముఖం పట్టగా, ఐరన్ పోషకాలు 27 శాతం మేర క్షీణించినట్టు అధ్యయనం తెలిపింది. గోధుమల్లో జింక్ స్థాయిలు 30 శాతం, ఐరన్ స్థాయిలు 19 శాతం మేర తగ్గినట్టు వెల్లడించింది.
ఇదే సమయంలో ఆర్సెనిక్ మోతాదు బియ్యంలో ఏకంగా 1,493 శాతం పెరిగినట్టు పేర్కొంది. గోధుమల్లోనూ దాదాపుగా ఈ స్థాయిలోనే ఆర్సెనిక్ పెరుగుదల నమోదైనట్టు వివరించింది. హరిత విప్లవంలో భాగంగా జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహారోత్పత్తిని పెంచడంపై దృష్టిసారించిన శాస్త్రవేత్తలు తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడినిచ్చే వినూత్న వంగడాలను తీసుకొచ్చారని అధ్యయనకారులు గుర్తు చేశారు.
తక్కువ సమయంలో పంట చేతికి రావాలన్న రీతిలో సాగును ప్రోత్సహించడంతో భూమిలోని పోషకాలు మొక్కకు అందడంలో ఆటంకాలు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు. ఫలితంగా శరీరానికి అవసరమైన జింక్, ఐరన్ వంటి పోషకాలు వరి, గోధుమ పంటల్లో క్రమంగా క్షీణించాయని తెలిపారు. ఇదే సమయంలో కృత్రిమ ఎరువులు, అధికంగా క్రిమిసంహారకాలు వాడకంతో ఆర్సెనిక్ వంటి ప్రమాదకరమైన మూలకాలు చేరినట్టు వెల్లడించారు.
తినే ఆహారంలో పోషకాలు తగ్గితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి క్రమంగా క్షీణిస్తుంది. దీంతో రోగాలబారిన పడుతాం. శరీరంలో ఐరన్, జింక్ లోపం ఏర్పడితే రక్తహీనత, పెరుగుదల లోపం వంటి సమస్యలు ఏర్పడొచ్చు. తినే ఆహారంలో ఆర్సెనిక్ వంటి పదార్థాలు చేరితే, గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, చర్మవ్యాధులు రావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.