ఫిబ్రవరిలో అయోధ్యను సందర్శించవద్దని కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. రామ మందిరానికి వెళ్లి ప్రోట్రోకాల్, వీఐపీ సందర్శన పేరుతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించవద్దని కోరారు. మార్చి నెలలో అయోధ్యకు వెళ్లాలని సూచించారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ పేర్కొన్నారు.
అలాగే అయోధ్యలోని రామ మందిరంలో సోమవారం జరిగిన ప్రాణప్రతిష్ట కార్యక్రమం, ప్రజల స్పందన గురించి కేబినెట్ మంత్రులను ఆయన ఆరా తీశారు.
ఇలా ఉండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కేంద్ర మంత్రివర్గం ప్రశంసల జల్లు కురిపించింది. బుధవారం ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక తీర్మానాన్ని ఏకగ్రీవంగా సభ్యులందరూ ఆమోదించారు. అయోధ్య రామజన్మభూమి వద్ద ఆలయ నిర్మాణం, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రిని అభినందిస్తూ, ప్రశంసిస్తూ ఈ తీర్మానాన్ని మంత్రివర్గంలోని మంత్రులు ప్రవేశపెట్టి ఆమోదించారు.
” బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన సందర్భంగా మీ నాయకత్వాన్ని, మంత్రివర్గ సభ్యులందరం హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. భారతీయుల 5 శతాబ్దాల కలను మీరు నెరవేర్చారు. నేటి మంత్రివర్గం చరిత్రాత్మకం. చారిత్రాత్మక సంఘటనలు గతంలో చాలా జరిగి ఉండవచ్చు, కానీ బ్రిటీష్ కాలంలోని వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కాలాన్ని సైతం కలుపుకుని నేటి కేబినెట్ వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత ఇలాంటి అవకాశం ఎప్పుడూ రాలేదు” అంటూ తీర్మానించారు
.కాగా, అయోధ్య రామ మందిరం సోమవారం ప్రారంభమైంది. అనంతరం రామ మందిరానికి భక్తుల తాకిడి పెరిగింది. మంగళవారం ఐదు లక్షల మంది, బుధవారం సుమారు మూడు లక్షల మందికిపైగా భక్తులు బాల రాముడ్ని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ బాగా పెరుగడంతో అయోధ్యకు బస్సు సర్వీసులను కూడా నిలిపివేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో భక్తుల రద్దీ గురించి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
మరోవంక, కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి హుండీ ఆదాయానికి శ్రీ అయోధ్య రాముడు పోటీ పడుతున్నాడు. జనవరి 22న ఆలయ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు 5 లక్షలకుపైగా భక్తులు అయోధ్య రాములోరిని దర్శించుకున్నారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ ఇన్ఛార్జ్ అనిల్ మిశ్రా మాట్లాడుతూ.. ప్రాణ ప్రతిష్ఠ తరువాత 10 విరాళాల కౌంటర్లను ప్రారంభించినట్లు చెప్పారు. మంగళవారం భక్తులు ఆలయ కౌంటర్లలో నగదు, ఆన్లైన్లో విరాళాలు సమర్పించారు.
ఆ ఒక్క రోజు వచ్చిన మొత్తం నగదు రూ.3 కోట్ల 17 లక్షలుగా తేలింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి హుండీ ఆదాయం సరాసరి రోజుకి రూ.3 – 4 కోట్లుగా ఉంటుంది. ఇలా శ్రీవారి ఆదాయానికి రాముడు పోటీ పడ్డాడన్నమాట. బుధవారం కూడా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదని.. 13 కి.మీ.ల మేర రాములవారి దర్శనానికి భక్తులు బారులు తీరినట్లు అధికారులు తెలిపారు.