గాజా పరిస్థితులు నరకంగా మారాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాల్పుల విరమణే ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదానికి శాశ్వత పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు. గాజాలో ప్రస్తుతం నరకంగా మారిందని, శాంతియుతంగా పరిష్కరించుకోవాలని గాజా ఆరోగ్య అత్యవసర పరిస్థితులపై జరిపిన చర్చలో ఆయన హితవు చెప్పారు.
ఇథియోపియాకు చెందిన టెడ్రోస్ చిన్నతనంలో స్వయంగా యుద్ధ పరిణామాలను ఎదుర్కొన్నారు. 1998- 2000 మధ్య ఎరిత్రియాతో సరిహద్దు యుద్ధ సమయంలో ఆయన పిల్లలూ బంకర్లలో తలదాచుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం గాజాలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ ఆయన చిన్నప్పటి పరిస్థిలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
ఘర్షణలు, ద్వేషం, ఆవేదన, విధ్వంసం తప్ప.. యుద్ధం ఎలాంటి పరిష్కారం ఇవ్వదని తన సొంత అనుభవంతో చెబుతున్నానని ఆయన తెలిపారు. అందుకే శాంతియుతంగా, రాజకీయంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకుందామని సూచించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే గాజాలో ఆకలి, వ్యాధులతో మరింత మంది చనిపోతారని టెడ్రోస్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, టెడ్రోస్ వ్యాఖ్యలు నాయకత్వ వైఫల్యానికి నిదర్శనమని ఐరాసలోని ఇజ్రాయెల్ రాయబారి మీరవ్ ఐలాన్ షహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి చేసినప్పటి నుంచి డబ్ల్యూహెచ్ఒ వైఖరి భిన్నంగా ఉందని ఆయన విమర్శించారు.
మరోవంక, గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడుతున్నదంటూ దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ న్యాయస్థానం (ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)) శుక్రవారం కీలక ఆదేశాలిచ్చింది. గాజాలో కొనసాగుతున్న నరమేధాన్ని ఆపేయాలంటూ ఇజ్రాయెల్ను ఆదేశించింది.
దీని కోసం అవసరమైన అన్ని చర్యలను వెంటనే చేపట్టాలని పేర్కొంది. గాజాలో జరిగిన దాడుల్లో గాయపడ్డ పౌరులకు మానవతా సాయాన్ని కొనసాగించేలా చూడాలని కూడా కోర్టు సూచించింది. తమ ఆదేశాలకు అనుగుణంగా తీసుకొన్న చర్యలపై నివేదికను నెలలోగా సమర్పించాలని ఇజ్రాయెల్ను ఆదేశించిన న్యాయస్థానం.
గాజాలో ప్రాణనష్టం, నష్టాన్ని పరిమితం చేయడానికి ఇజ్రాయెల్ తక్షణ, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఐసిజె డిమాండ్ చేసింది. పాలస్తీనియన్లను రక్షించడానికి అదనపు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ప్రాంతానికి అత్యవసరంగా అవసరమైన ప్రాథమిక సేవలు, మానవతా సహాయాన్ని అందించడానికి అనుమతించాలని ఇజ్రాయెల్ను ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాల పట్ల ఇజ్రాయిల్ విముఖత వ్యక్తం చేస్తున్నది.