అత్యంత వివాదాస్పదమైన చండీగఢ్ మేయర్ ఎన్నిక వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం నిప్పులు చెరిగింది. ఘాటు విమర్శలు చేసింది. అదే తీవ్రతతో కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త మేయర్ సారథ్యంలో ఎలాంటి సమావేశాలను కూడా నిర్వహించకూడదంటూ తక్షణ ఆదేశాలను జారీ చేసింది.
రిటర్నింగ్ అధికారి చేసిన పని ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్లేనని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మండిపడ్డారు. ‘ఆయన కెమెరా వైపు చూస్తూ బ్యాలెట్ పేపర్లు పాడు చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అని ఆదేశించారు. సాయంత్రం 5 గంటలలోపు ఎన్నికలకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపరచాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు.
మంగళవారం జరగాల్సిన భావించిన చండీగఢ్ పాలనా యంత్రాంగం బడ్జెట్ సెషన్‌ను కూడా సుప్రీంకోర్టు స్తంభింపజేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బడ్జెట్‌ను సమర్పించవద్దని న్యాయమూర్తులు చంద్రచూడ్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.
తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. ఇటీవలే జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ సీనియర్ నేత మనోజ్ సోంకర్ చండీగఢ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ- కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి కుల్దీప్ సింగ్‌ను మట్టికరిపించారు. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న మొత్తం సంఖ్యాబలం 35.
కౌన్సిలర్లుగా ఎన్నికైన వారిలో బీజేపీ-14, ఆమ్ ఆద్మీ పార్టీ-13, కాంగ్రెస్-7, శిరోమణి అకాలీదళ్‌కు ఒక సభ్యుడు ఉన్నారు. మేయర్ ఎన్నికలో బీజేపీ తరఫున మనోజ్ సోంకర్, ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అభ్యర్థిగా కుల్దీప్ సింగ్ పోటీ చేశారు. నిజానికి ఈ ఎన్నికలో సంఖ్యాపరంగా చూసుకుంటే ఆప్- కాంగ్రెస్ ఉమ్మడి కూటమి అభ్యర్థి విజయం సాధించాల్సి ఉంది. అలా జరగలేదు.
పోలింగ్ సమయంలో బీజేపీ అభ్యర్థికి 16 ఓట్లు పడ్డాయి. కుల్దీప్ సింగ్‌కు 12 ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెెస్- ఆప్‌కు చెందిన ఎనిమిది ఓట్లను రిటర్నింగ్ అధికారి అనిల్ మసీ చెల్లనివిగా ప్రకటించారు. దీనితో 16 ఓట్లతో బీజేపీ అభ్యర్థి గెలిచారు.
ఈ ఎన్నిక వ్యవహారంపై ఆప్- కాంగ్రెస్ కూటమి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. మేయర్ ఎన్నికలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలిపింది. తమకు ఉన్న సంఖ్యాబలం గురించి వివరించింది. ప్రత్యేకించి- తమ కూటమికి చెందిన కౌన్సిలర్లు వేసిన ఎనిమిది ఓట్లను చెల్లనివిగా ప్రకటించడం సరికాదని, దీనిపై విచారణ జరిపించాలని కోరింది.