తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీ ఛలో ఆందోళన తలపెట్టిన రైతులతో కేంద్ర ప్రభుత్వం సోమవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రైతు సంఘాల నేతలతో ఆరు గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చలు ఎటువంటి పరిష్కారం లేకుండా ముగిశాయి. దీనిపై రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చర్చల విషయంలో చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.
పోలీసులు, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ ఆందోళన ఆగబోదని, ఢిల్లీ ఛలో నిర్వహించి తీరుతామని నాయకులు స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మార్చ్ ప్రారంభమవుతుందని ఉద్ఘాటించారు.
‘చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు.. మేము ఉదయం 10 గంటలకు ఢిల్లీకి మా మార్చ్ ప్రారంభిస్తాం… అయితే, మేము మా ఫోరమ్‌లో ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చిస్తాం.. కానీ, ఇక్కడ ప్రభుత్వ తప్పు స్పష్టంగా ఉంది’ చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన ఒక రైతు సంఘం నాయకుడు చెప్పారు.
విద్యుత్ చట్టం- 2020ని రద్దు చేయడం, లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాకాండలో మరణించిన రైతులకు పరిహారం ఇవ్వడంపై వారు చర్చించారు. ఇప్పుడు రద్దు చేసిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు సాగిన నిరసనల సందర్భంగా తమపై పెట్టిన కేసులను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది.
మరోవైపు, రైతుల మార్చ్‌ను అడ్డుకోడానికి రోడ్లపై ఎక్కడికక్కడ సరిహద్దులను మూసివేసి, ఇసుక సంచులు, ముళ్ల కంచెలు, కాంక్రీట్ దిమ్మెలు, అల్లర్ల నిరోధక బలగాలను మోహరించారు. తమ అన్ని ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు హామీనిస్తూ చట్టం తేవాలని, రుణ మాఫీ, పింఛన్లు తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పార్లమెంటు ముట్టడికి రైతు సంఘాలు మంగళవారం ఢిల్లీ ఛలో కార్యక్రమం తలపెట్టాయి.
ఈ నేపథ్యంలో పోలీసులు, భద్రతా దళాలు అత్యంత అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ నగరాన్ని అష్ట దిగ్బంధం చేసిన పోలీసులు.. నెల రోజుల పాటు 114 సెక్షన్ అమలయ్యేలా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. యూపీ, పంజాబ్, హరియాణాతో ఉన్న సరిహద్దుల్లో జాతీయ రహదారులను పూర్తిగా మూసివేశారు. వాహనాలు ముందుకు కదలకుండా టైర్లు పంక్చర్ అయ్యేలా రోడ్లపై మేకులు దింపారు.
ఘజియాబాద్‌తో పాటు పలుచోట్ల రోడ్లపై అడ్డంగా సిమెంటు దిమ్మెలు పెట్టి వాటి మధ్య సిమ్మెంట్‌తో కాంక్రీట్ చేశారు. లౌడ్ స్పీకర్లపైనా ఆంక్షలు విధించిన పోలీసులు.. అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రధాన రోడ్లపైకి రావొద్దని సూచించారు. అయితే, పంజాబ్ నుంచి మందీ మార్బలంతో ఢిల్లీ దిశగా ట్రాక్టర్లు బయల్దేరాయి.
ఢిల్లీ ఛలో మార్చ్‌కు 2,500 ట్రాక్టర్లలో వివిధ రాష్ట్రాలకు చెందిన 25 వేల మంది రైతులు రానున్నారని నిఘా వర్గాలు అంచనా వేశాయి. రైతు సంఘాలు 40 సార్లు రిహార్సిల్స్ కూడా చేశాయని పేర్కొన్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కేరళ, కర్ణాటక, తమిళనాడు రైతులు కూడా ఢిల్లీ చేరుకునే వీలుందని భావిస్తున్నాయి. మొత్తం 200 రైతు సంఘాలు ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా ప్రకటించాయి.