రాజకీయ పార్టీలు అధికారికంగా విరాళాల సేకరణకు ఉద్దేశించిన ‘ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్’పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని, ఈ స్కీమ్‌ని నిలిపివేయాలని సీజేఐ చంద్రచూడ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది.
రాజకీయ విరాళాల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు 2018లో తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. నల్లధనాన్ని రూపుమాపడానికి ఎలక్టోరల్ బాండ్లు ఒక్కటే మార్గం కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎలక్టోరల్ బాండ్లు విక్రయించరాదని కోర్టు తీర్పునిచ్చింది.
ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తీసుకున్న ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ఉందని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అనామక ఎలక్టోరల్ బాండ్లు సమాచార హక్కు (ఆర్టీఐ), ఆర్టికల్ 19(1)(ఎ)లను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. ఈ తీర్పును వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు.
ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా క్విడ్ ప్రోకోకు అవకాశం ఉందని, పౌరుల సమాచార హక్కును ఈ స్కీమ్ ఉల్లంఘిస్తోందని వివరించింది. ఎలక్టోరల్ బాండ్ల జారీని తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సేకరించిన విరాళాలు, పార్టీల వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది.
రాజకీయ పార్టీలకు ఆర్థిక సహాయం రెండు విధాలుగా ఉండొచ్చని కోర్టు అభిప్రాయపడింది. ఒక పార్టీకి మద్దతుగా అందించే విరాళాలు క్విడ్ ప్రోకోకు దారితీసే అవకాశం ఉందని కోర్ట్ అభిప్రాయపడింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఎలక్టోరల్ బాండ్ల పథకం ఒక్కటే మార్గంకాదని, ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నాయని రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది.
రాజకీయ విరాళాల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు 2018లో తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. నల్లధనాన్ని రూపుమాపడానికి ఎలక్టోరల్ బాండ్లు ఒక్కటే మార్గం కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎలక్టోరల్ బాండ్లు విక్రయించరాదని కోర్టు తీర్పునిచ్చింది.
కాంగ్రెస్ నాయకులు జయ ఠాకూర్‌తో పాటు సీపీఎం, ఎన్జీవో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) దాఖలు చేసిన నాలుగు వేర్వేరు పిటిషన్లపై గతేడాది అక్టోబర్ 31న సుప్రీంకోర్టులో వాదనలు మొదలయ్యాయి. ఈ కేసు విచారణ ఇదివరకే పూర్తయినప్పటికీ తీర్పును రిజర్వ్ చేస్తూ నవంబర్ 2న కోర్ట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
కాగా ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌ను జనవరి 2, 2018న కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీలు పారదర్శకత పద్ధతిలో నిధులు సేకరిస్తున్నాయి. పథకానికి సంబంధించిన రూల్స్ ప్రకారం.. ఏ భారత పౌరుడు లేదా స్థాపించబడిన సంస్థ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు.
వ్యక్తిగతంగా లేదా కొంతమంది వ్యక్తుల సమూహం కలిసి ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29ఏ కింద రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు సేకరించే వెసులుబాటు ఉంటుంది. అర్హత కలిగిన రాజకీయ పార్టీలు అధీకృత బ్యాంకు అకౌంట్ ద్వారా మాత్రమే విరాళాలను పొందాల్సి ఉంటుంది.