కాళేశ్వరం ప్రాజెక్టులో రీ ఇంజినీరింగ్, మార్పుల కారణంగా ఖర్చు పెరిగింది తప్ప అదనంగా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని కాగ్ వెల్లడించింది. మార్పుల వల్ల గతంలో చేసిన కొన్ని పనులు నిరర్థకంగా మారాయని తెలిపింది. దీంతో రూ.765 కోట్లు నష్టం వాటిల్లిందని తన రిపోర్టులో వెల్లడించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులను అనవసరంగా చేపట్టినట్లు అయిందని, దీనికి అదనంగా రూ.25 వేల కోట్లు ఖర్చయిందని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. డీపీఆర్ ఆమోదానికి ముందే రూ.25 వేల కోట్ల విలువైన 17 పనులను నీటిపారుదల శాఖ కాంట్రాక్టర్లకు అప్పగించిందని కాగ్ ఆరోపించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సాగునీటిపై మూలధన వ్యయం ఎకరా ఒక్కింటికి రూ.6.42 లక్షలు ఖర్చవుతోందని తన నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టు ప్రయోజనాలు, ప్రాజెక్టుకు అయిన వ్యయం నిష్పత్తి 1:51 గా అంచనా వేశారు. కానీ ఈ నిష్పత్తి 0:75 శాతంగా ఉంది. ఇది మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపింది.
రూ.87,449కోట్ల రుపాయలు రుణాలను కార్పొరేషన్ ద్వారా సేకరించారని కాగ్ నివేదికలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎలాంటి ఆదాయం లేనందున దాని వల్ల ప్రభుత్వానికి తీవ్ర భారంగా మారుతుందన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో అప్పులు చెల్లించే పరిస్థితి లేనందున చెల్లింపులు వాయిదా వేయాలని కోరారని కాగ్ నివేదికలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనేక లోపాలు ఉన్నాయని కాగ్ నివేదిక పేర్కొంది.
బిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను తప్పబట్టిన కాగ్ ప్రాజెక్టు వ్యయం 122 శాతం పెరిగిందని తేల్చింది. ఆయకట్టు మాత్రం 52 శాతం మాత్రమే పెరిగిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు డీపీఆర్‌కు ముందు రూ.25వేల కోట్లతో ప్రతిపాదనలు చేశారని, ప్రాజెక్ట్ వ్యయం రూ.63వేల352 కోట్ల నుంచి రూ.లక్షా 2వేల 267 కోట్లు పెరిగిందని కాగ్ పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణంతోకలిగే ప్రయోజనాలను ఎక్కువ చేసి చూపించారని అభిప్రాయపడింది.
ఏటా విద్యుత్ చార్జీల కోసం రూ.10వేల 374 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్టు నిర్వాహణ ఖర్చు ఏడాదికి రూ.10వేల 647 కోట్లు అవుతుందని, కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.81,911 కోట్లు అితే అది భారీగా పెరిగిందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ అంచనాలన్నిటికీ కలిపి ప్రభుత్వం ఓకేసారి అనుమతి ఇవ్వలేదని, విడతల వారీగా ఒక్కో పనికీ విడివిడిగా అనుమతులు జారీ చేశారని కాగ్ పేర్కొంది.