తెలంగాణ కుంభమేళా భావించే మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో పాటు భక్తులకు ప్రయాణ సౌకర్యాలు కల్పించింది. టీఎస్ ఆర్టీసీ జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతుంది. కోటి మందికి పైగా మేడారం జాతరకు వస్తారని సమాచారం. మేడారం జాతరకు దక్షిమ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ నడుపుతోంది.
వరంగల్-సికింద్రాబాద్-వరంగల్ (రైలు నెం.07014/07015), సిరిపుర్ కాగజ్‌నగర్-వరంగల్- సిరిపుర్ కాగజ్‌నగర్ (రైలు నెం.07017/07018), నిజామాబాద్-వరంగల్-నిజామాబాద్ (రైలు నెం.07019/0720) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్, హైదరాబాద్, సిర్పుర్ కాగజ్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భువనగిరి, జనగామ, ఘన్పూర్, కామారెడ్డి, మనోహరాబాద్, మేడ్చల్, ఆలేరు మీదు ప్రయాణిస్తాయి.
ఈ నెల 21 నుంచి 25 వరకు సికింద్రాబాద్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ఈ ట్రైన్ మౌలాలి, చర్లపల్లి, ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి, యాదగిరి, వంగపల్లి, ఆలేరు, పెంబర్తి, జనగామ, రఘునాథపల్లి, స్టేషన్ ఘన్పూర్, పెండ్యాల్, కాజీపేట మీదుగా ప్రయాణిస్తుంది. ఈ రోజు ప్రతి రోజు ఉదయం 9.52 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వరంగల్‌కు మధ్యాహ్న గం.1.00 కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ తిరిగి మధ్యాహ్నం గం.1.55 లకు వరంగల్‌లో బయలుదేరి సాయంత్రం గం.6.20 లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
6 వేలకు పైగా ఆర్టీసీ బస్సులు
ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యే మేడారం మహాజాతరలో వన దేవతలను దర్శించుకోవడానికి దాదాపు కోటిన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం రూ.105 కోట్లతో జాతరలో ఏర్పాట్లు చేస్తోంది. భక్తులను మేడారం చేర్చేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈసారి ఏకంగా 51 సెంటర్ల నుంచి ఆరు వేలకు పైగా బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఇప్పటికే మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత రవాణా సదుపాయం కల్పించగా గత జాతరలతో పోలిస్తే ఈ సంవత్సరం ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహాలక్ష్మీ పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేలకు పైగా ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 40 లక్షల మంది వరకు మేడారం జాతరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రాకపోకలు సాగించే భక్తులకు టీఎస్ఆర్టీసీ ఛార్జీలు ఖరారు చేసింది.
మేడారం జాతకు హెలీకాఫ్టర్ సేవలు
మేడారం జాతరకు హెలీకాఫ్టర్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. గత రెండు జాతరల నుంచి మేడారానికి హెలీకాఫ్టర్ సేవలు అందుబాటులోకి తీసుకురాగా.. ఈసారి కూడా ఆకాశ మార్గాన ప్రయాణం కోసం హెలిక్యాప్టర్ సేవలు అందుబాటులో ఉంచనున్నారు. ఈ మేరకు ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు ఈ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలీప్యాడ్ కు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లేదా కాజీపేటలోని సెయింట్ గ్యాబ్రియేల్ స్కూల్ గ్రౌండ్ నుంచి మేడారం గద్దెల సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వరకు భక్తులను ఆకాశ మార్గాన తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు.