ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
‘మేడారం జాతర.. గిరిజనుల అతిపెద్ద పండుగల్లో ఒకటి. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క- సారక్కలకు ప్రణమిల్లుదాం. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందాం. మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
కాగా, తెలంగాణలో అతి పెద్ద మహా కుంభవేళగా భావించే మేడారం మహాజాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ ఏడాది ఈరోజు నుండి ఈ మహాజాతర మొదలైంది. జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులు ఇప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇంకా పెద్ద ఎత్తున భక్తులు వస్తూనే ఉన్నారు. తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా మేడారం తరలి వస్తున్నారు.
సమ్మక్క తనయుడు కన్నెపల్లిలో కొలువైన జంపన్న మంగళవారం రాత్రి 7.09 గంటలకు బయలుదేరి 8 గంటలకు వాగు ఒడ్డున ఉన్న గద్దెపైకి చేరుకున్నాడు. పూజారి పోలెబోయిన సత్యం కన్నెపల్లిలోని ఇంటిలో పూజా సామగ్రిని శుద్ధిచేసిన అనంతరం జంపన్న గద్దెకు అలుకుపూతలు నిర్వహించి ఆయన ప్రతిరూపమైన డాలు, కర్రకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. గ్రామ మహిళలు ఊరు పొడవునా నీళ్లారబోస్తూ జంపన్నను సాగనంపారు.
కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ ఇవాళ మొదలైంది. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు పూజలు నిర్వహిస్తారు. ఆదివాసీ పూజారులు, మంత్రి సీతక్క, ములుగు కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లు, ఏఎస్పీలు కలిసి కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెల వద్దకు తీసుకు వస్తారు.
సమ్మక్క-సారలమ్మ దర్శనం కోసం భారీగా భక్తులు తరలివస్తున్నారు. 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతోంది వనదేవతల జాతర. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు సాయంత్రం గద్దెలపైకి చేరుకుంటారు. రేపు సమ్మక్క తల్లి మేడారం గద్దెలపైకి చేరుకోనున్నారు. రేపు వనదేవతల జాతరకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు.
ఇప్పటికే మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. వన దేవతల దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. మేడారం జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మేడారం మహా జాతరకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ తెలిపారు.
రెగ్యులర్ సర్వీసులు తగ్గించడంతో సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అందువల్ల భక్తులకు, ఆర్టీసి సిబ్బందికి సహకరించాలని కోరుతూ ఆయన సామాజిక మాధ్యమంలో ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి ఆర్టీసి నడుపుతోందని ఎండి సజ్జనార్ తెలిపారు.