తీవ్ర రాజకీయ, ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడి రెండు వారాలు గడిచినా కొత్త ప్రభుత్వ ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి. పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ మళ్లీ ప్రధాని పదవిని చేపట్టనున్నట్టు పీపీపీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో ప్రకటించారు.
మంగళవారం అర్దరాత్రి షరీఫ్, బిలావల్ భుట్టోలు అత్యవసరంగా సమావేశమై సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు జరిపారు. ఒప్పందం ప్రకారం ప్రధానిగా షెహబాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో పార్టీ ఛైర్మన్ ఆసిఫ్ జర్దారీ పాక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించారు. దేశంలో ఉన్న అంతర్గత సమస్యలను కలిసికట్టుగా ఎదుర్కొంటామని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు.
ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగిన సంఖ్యాబలం ఉందని బిలావల్ ప్రకటించారు. దీంతో రెండు వారాలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు త్వరలో తెరపడనుంది. ఫిబ్రవరి 29లోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటై పార్లమెంట్ సమావేశం కావాల్సి ఉందని ఆపద్ధర్మ ప్రభుత్వంలోని సమాచార మంత్రి ముర్తాజా సొలంజి తెలిపారు.
ఫిబ్రవరి 8న జరిగిన పాకిస్థాన్ ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు అత్యధికంగా 101 స్థానాల్లో విజయం సాధించారు. మొత్తం 265 స్థానాలున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజార్టీ 133. దీంతో 75 సీట్లు సాధించిన పీఎంఎల్-ఎన్, 54 స్థానాల్లో నెగ్గిన పీపీపీలు, 17 సీట్లు గెలిచిన ఎంక్యూఎం-పీ సహా చిన్న చితకా పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి ముందుకొచ్చాయి.
ఇరు పార్టీల మధ్య పలుసార్లు చర్చలు జరిగినా అసంపూర్తిగానే ముగిశాయి. మంగళవారం జరిగిన చర్చలు ఫలించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పీఎంఎల్ఎన్, పీపీపీ ప్రకటించాయి. కాగా, ఈ పరిణామాలపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ-ఇన్సాఫ్ మద్దతుదారులు ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింది.
ఎన్నికల్లో రిగ్గింగ్ ఆరోపణలపై ఇప్పటికే పీటీఐ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. అవినీతి సహా పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయన్ను ఎన్నికల్లో పోటీచేయకుండా పాక్ ఎన్నికల కమిషన్ నిషేధించింది. అలాగే, ఆయన పార్టీ పీటీఐ గుర్తు అయిన బ్యాట్‌ను కూడా రద్దుచేయడంతో స్వతంత్రులుగా పోటీచేయాల్సి వచ్చింది.