తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ పాలకమండలి వేటు వేసింది. ఈమేరకు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి సోమవారం వెల్లడించారు. టీటీడీ, ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయ్యర్లపై రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలపై పాలకమండలి సమావేశంలో చర్చించి ఆయనపై చర్యలకు నిర్ణయించినట్లు చెప్పారు.
పాలకమండలి నిర్ణయం మేరకు దీక్షితులను టీటీడీ నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. తిరుమలలో అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయని పేర్కొంటూ రమణ దీక్షితులు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తిరుమలలో క్రిస్టియానిటీ వేగంగా వ్యాప్తి చెందిందని, సీఎం జగన్ క్రిస్టియన్ కావడంతో ఆలయంలోనూ ఆ మతం వ్యాపిస్తోందని రమణ దీక్షితులు ఆరోపించారు.
గత నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ తిరుమలను సందర్శించిన సందర్భంగా రమణ దీక్షితులు చేసిన ట్విట్ సంచలనం రేపింది. తిరుమల ఆలయంలో సనాతన ధర్మాన్ని పాటించని ఓ అధికారి, ప్రాచీన సంప్రదాయాలు, నిర్మాణాలు, ఆస్తులను వ్యవస్థీకృతంగా నాశనం చేస్తున్నారని, దయచేసి ఆలయాన్ని కాపాడాలని కోరారు.
కాగా, గాలిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మోకాల మిట్ట ప్రాంతాల్లో ఇకపై నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయించినట్టు కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయించారు. శ్రీవారి ఆలయంలోని జయ విజయల వద్ద వున్న తలుపులకు 1.69 కోట్లతో బంగారు తాపడం చేయనున్నారు.
రూ.4కోట్లతో 4,5,10 గ్రాముల తాళి బోట్టులు తయ్యారి.. నాలుగు కంపెనీలకు టెండర్ కేటాయింపు.. ధార్మిక సదస్సులో తీసుకున్న అన్ని నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఇకపై ప్రతి ఏటా టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి అవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 24వ తేదీన నిర్వహించాలని పాలకమండలి నిర్ణయించింది. ఇదే సమయంలో అటవీ కార్మికుల జీతాల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
వడమాలపేటలోని ఉద్యోగుల ఇంటి స్థలాల వద్ద అభివృద్ధి పనులకు తుడాకు రూ.8.16 కోట్లు చెల్లించాలనే నిర్ణయానికి వచ్చారు. రూ.3.89 కోట్లతో తిరుచానూరులో లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. అలిపిరిలో వున్న గోశాల వద్ద రూ.4.12 కోట్లతో శాశ్వత యాగశాల నిర్మాణం చేసేందుకు నిర్ణయం తీసుకోగా.. విరాళంగా రూ.1.8 కోట్లు ఇచ్చేందుకు సముఖుత వ్యక్తం చేశారు శేఖర్ రెడ్డి.. ఇక, 15 పోటు సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు.