షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం ముగియడంతో పాకిస్తాన్ రావి నది నుంచి నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేసినట్లు మీడియా వార్తల ద్వారా తెలియవచ్చింది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో షాపూర్ కంది బ్యారేజ్ ఉన్నది. ఈ చర్య వల్ల పాకిస్తాన్కు ఇంతకుముందు కేటాయించిన 1150 క్యూసెక్కుల నీరు జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి లభ్యం అవుతుంది.
ఈ జలాలను నీటిపారుదల అవసరాలకు వినియోగిస్తారు. కథువా, సాంబా జిల్లాల్లో 32 వేల హెక్టార్ల భూమికి దీని వల్ల ప్రయోజనం కలుగుతుంది. నీటిపారుదలకు, జల విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన షాపూర్ కంది బ్యారేజ్ ప్రాజెక్టుకు గత మూడు దశాబ్దాలలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.
జమ్మూ కాశ్మీర్లో వేలాది ఎకరాల వ్యవసాయ భూమికి నీటిపారుదల సౌకర్యం కలిగించే అవకాశం ఉన్నందున షాపూర్ కంది డ్యామ్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోడీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. గడచిన 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న షాపూర్ కంది డ్యామ్ ప్రాజెక్టుపై పనిని తిరిగి ప్రారంభించేందుకు జమ్మూ కాశ్మీర్, పంజాబ్ 2018 సెప్టెంబర్ 8న ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి.
1960లో భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన సింధు జలాల సంధి ప్రకారం భారత్కు రావి, సట్లెజ్, బియాస్ నదులపైపూర్తి హక్కులు ఉండగా, సింధు, జీలం, చీనాబ్ నదులపై పాకిస్తాన్కు ఆధిపత్యం ఉంటుంది. షాపూర్ కంది ప్రాజెక్టు పూర్తి కావడం వల్ల భారత్కు రావి నది నీటిని గరిష్ఠ స్థాయిలో వినియోగించుకునే అవకాశల లభిస్తున్నది.