కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 6న దేశ రాజధాని ఢిల్లీకి తరలి రావాలని రైతు నేతలు పిలుపునిచ్చారు. ఇటీవల జరిపిన ఆందోళనలో అసువులు బాసిన రైతు స్వగ్రామం బల్లాహ్లో ఆదివారం జరిగిన సభలో రైతు సంఘం నేతలు శర్వాన్ సింగ్ పంధేర్, జగ్జిత్ సింగ్ దల్లేవాల్ మాట్లాడారు.
ఈ నెల 10న రైతులు దేశవ్యాప్తంగా నాలుగు గంటల పాటు రైల్‌రోకో నిర్వహించాలని పిలుపునిచ్చారు. డిమాండ్ల సాధనకు రైతులు ఇప్పటివరకు చేస్తున్న ఆందోళనను తామున్న ప్రదేశం నుంచే కొనసాగిస్తూ మరింత ఉద్ధృతం చేయాలన్నారు. ఢిల్లీ చలో మార్చ్‌ని మరింత వ్యాప్తి చేయాలని కిసాన్ మజ్దూర్ మోర్చా పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా శంభు, ఖనౌరి సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న పంజాబ్, హర్యానా రైతులకు రెండు సంఘాలు మద్దతు ప్రకటిస్తూ ఇతర రాష్ర్టాలకు చెందిన రైతులు, రైతు కూలీలు ఈ నెల 6న ఢిల్లీకి చేరుకుని రైతుల డిమాండ్లపై నినదించాలని పిలుపునిచ్చాయి.
ట్రాక్టర్ ట్రాలీలు, ఇతర వాహనాల ద్వారా ఢిల్లీకి చేరుకోలేని ఇతర రాష్ర్టాల రైతులు రైలు, ఇతర మార్గాల ద్వారా చేరుకోవాలని నేతలు సూచించారు. దీనివల్ల ట్రాక్టర్, ట్రాలీల ప్రవేశానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా పర్వాలేదని అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి మార్చి 10న మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు దేశ వ్యాప్తంగా రైల్‌రోకోలు నిర్వహించాలన్నారు.
పంజాబ్‌లోని పంచాయతీలన్నీ రైతుల ఆందోళనకు తీర్మానం చేయాలని, ప్రతి గ్రామం నుంచి ఒక ట్రాక్టర్ ట్రాలీ ఆందోళన జరుగుతున్న బోర్డర్ పాయింట్‌కు పంపాలని వారు కోరారు.