ఉద్యోగ వంచనకు గురై రష్యన్ సైన్యంలో చేరవలసి వచ్చిన 30 ఏళ్ల హైదరాబాదీ ఉక్రెయిన్‌తో రష్యా ప్రస్తుతం సాగిస్తున్న పోరులో హతుడయ్యాడు. ఆ యువకుని మహమ్మద్ అస్ఫాన్గా గుర్తించారు. అతనిని రష్యా నుంచి తిరిగి తీసుకురావడంలో సాయం చేయవలసిందిగా ఎఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీని కోరారు.
అయితే, మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని ఒవైసీ సంప్రదించినప్పుడు అస్ఫాన్ మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఆ యువకునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతరులు పలువురితో పాటు అస్ఫాన్‌ను మోసపూరిత ఏజెంట్లు తప్పుదోవ పట్టించి, యుద్ధంలో రష్యా సైన్యానికి సాయంగా ‘హెల్పర్లు’గా రిక్రూట్ చేసినట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్‌తో ప్రస్తుతం సాగుతున్న పోరులో రష్యన్ సైన్యంలో ‘హెల్పర్’గా పని చేస్తున్న గుజరాత్‌కు చెందిన 23 ఏళ్ల వ్యక్తి రష్యాలో మరణించిన కొన్ని వారాల తరువాత తాజా మృతి వార్త వచ్చింది. సూరత్‌కు చెందిన హామిల్ మంగుకియాగా గుర్తించిన ఆ వ్యక్తి ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా రష్యాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసి, చెన్నై నుంచి మాస్కో చేరాడు.
అతనిని రష్యన్ సైన్యంలో ఒక అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దులోని డొనెట్స్క్ ప్రాంతంలో ఫిబ్రవరి 21న ఉక్రెయిన్ వైమానిక దాడిలో మంగుకియా మరణించాడు. రష్యన్ సైన్యంలో భద్రత హెల్పర్లుగా పని చేసేలా పలువురు భారతీయులను మోసగించారు. సరిహద్దు ప్రాంతాలలో ఉక్రెయిన్ సైనికులతో పోరాడేందుకు కొందరిని బలవంతం చేసినట్లు మీడియా వార్తలు సూచించాయి.
మీడియా వార్తలకు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ క్రితం నెల స్పందిస్తూ, రష్యన్ సైన్యానికి అనుబంధ సిబ్బందిగా పని చేస్తున్న భారత జాతీయులను ‘త్వరగా విముక్తం చేసేలా’ భారత ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందని తెలియజేసింది. ‘రష్యన్ సైన్యానికి అనుబంధ సిబ్బందిగా లేదా హెల్పర్లుగా పని చేసేందుకు అక్కడికి సుమారు 20 మంది వెళ్లారని మా అవగాహన’ అని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఫిబ్రవరి 29న విలేకరుల గోష్ఠిలో వెల్లడించారు.
‘వారిని త్వరగా విడుదల చేయించేందుకు మేము శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన తెలిపారు. భారతీయులు తిరిగి వచ్చేలా చూసేందుకు న్యూఢిల్లీలోను, మాస్కోలోను రష్యన్ అధికారులను భారత్ ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నదని కూడా జైశ్వాల్ తెలియజేశారు.