సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో నిందితుడి కొత్త ఫోటోలను దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారంనాడు విడుదల చేసింది. మార్చి 1న జరిగిన ఈ పేలుడులో సుమారు 10 మంది గాయపడ్డారు. 3వ తేదీన కేసు దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టింది. కేఫ్‌లో పేలుడు జరిగిన సుమారు ఒక గంటకు నిందితుడు ఒక బస్సు ఎక్కుతుండటం సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించారు.
టైమ్‌స్టాంప్ మధ్యాహ్నం 2.03 గంటలుగా వీడియోలో ఉండగా, 12.56 గంటలకు కేఫ్‌లో పేలుడు జరిగింది. అనుమానితుడు టీ-షర్డ్, టోపీ, ఫేస్ మాస్క్ వేసుకుని కనిపించాడు. కాగా, అదే రోజు (మార్చి1) మరో ఫుటేజిలో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక బస్సు స్టేషన్ లోపల అతను తిరుగుతున్నట్టుగా ఉంది. అనుమానితుడికి సంబంధించి సమాచారం తమకు తెలియజేస్తే రూ.10 లక్షలు రివార్డుగా ఇస్తామని కూడా ఎన్ఐఏ ప్రకటించింది. సమాచారం ఇచ్చిన వ్యక్తి పేరును గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది.
కాగా, పేలుడు జరిగిన తర్వాత 8 రోజులకు కేఫ్ శనివారం తెరుచుంది. ఈ కేసుని ఎన్ఐఏకు అప్పగించిన తర్వాత.. కేఫ్‌లో దెబ్బతిన్న భాగాలకు మరమ్మతులు చేసి ప్రారంభించినట్లు కేఫ్ హెచ్ఆర్ హెడ్ తెలిపారు.పేలుడు తర్వాత మరింత బలంగా, ప్రకాశవంతంగా తిరిగి తెరుస్తున్నాం అని ఆయన అన్నారు. మరోవైపు కేఫ్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. కేఫ్‌కు వచ్చే అందర్నీ తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు.
మెటల్ డిటెక్టర్లనూ కూడా ఏర్పాటు చేశారు. రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1వ తేదీన మధ్యాహ్నం పేలుడు జరిగింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. కాగా.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బాంబ్ బ్లాస్ట్ కు కారణమైన వ్యక్తి ఫొటోను రిలీజ్ చేశారు అధికారులు. నిందితుడి ఆచూకీ తెలిసిన వారికి రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు.