ఎలక్టోరల్ బాండ్స్ కేసులో భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. గడువు పొడిగించే ప్రసక్తే లేదని చెబుతూ రేపటిలోగా బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయాలని ఎస్బీఐకి స్పష్టం చేసింది. అలాగే మార్చి 15 లోగా బాండ్ల వివరాలను వెబ్సైట్లో ఉంచాలని ఈసీని ఆదేశించింది.
ఇక ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్ 30 వరకూ పొడిగించాలంటూ ఎస్బీఐ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపే టైంలోఎస్బీఐ వాదనలపై సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దాతల వివరాల్ని సరిపోల్చుకోవడానికి సమయం పడుతుందని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఎదుట ఎస్బీఐ వాదన వినిపించింది. అయితే గత 26 రోజులుగా ఏం చేశారని బెంచ్ ఈ సందర్భంగా ఎస్బీఐని ప్రశ్నించింది.
గత నెలలో రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు.. బాండ్ల జారీని తక్షణమే ఆపేయాలంటూ ఎస్బీఐని ఆదేశించింది.
అదే సమయంలో వాటి ద్వారా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను ఈనెల 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్బీఐని ఆదేశించింది కూడా. ఆపై ఆ సమాచారాన్ని పబ్లిక్ డొమైన్ ద్వారా ఈనెల 13లోగా బహిరంగపరచాలని ఈసీకి స్పష్టంచేసింది. ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్బీఐ సుప్రీంకోర్టు ఆశ్రయించింది.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. మరో మూడు వారాల్లో ఆ బాండ్ల వివరాలను వెల్లడించనున్నట్లు కోర్టుకు ఎస్బీఐ తెలిపింది. నిజానికి జూన్ 30వ తేదీ వరకు పొడగింపు ఇవ్వాలని తొలుత ఎస్బీఐ తన అప్లికేషన్లో కోర్టును కోరింది. దానిపైనే ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
బాండ్లను ఎవరు కోనుగోలు చేశారన్న అంశంపై వివరాలను వద్దనుకుంటే మూడు వారాల్లోగా ఆ బాండ్ల వివరాలను వెల్లడించనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఇంకా మూడు వారాల సమయం ఎందుకు అని కోర్టు ప్రశ్నించింది. రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ బాండ్ల డబ్బుకు సంబంధించిన వివరాలను సమర్పించాయి కదా అని కోర్టు తెలిపింది. ఏప్రిల్ 12, 2019 నుంచి 15 ఫిబ్రవరి, 2024 మధ్య కాలంలో ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు, విత్‌డ్రాకు చెందిన సమాచారాన్ని ఇవ్వాలని ఎస్బీఐని కోర్టు ఆదేశించింది.