రామజన్మభూమిలో భవ్యమైన మందిరంలో జనవరి 22న ప్రాణప్రతిష్ట జరిగినప్పటి నుంచి పెద్ద ఎత్తున అయోధ్యకు భక్తులు తరలివస్తున్నారు. దీంతో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయం దర్శన సమయాన్ని కూడా పొడిగించింది శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకూ దర్శనాలకు అనుమతిస్తున్నట్టు తెలిపింది.
రాత్రి 10 గంటలకు శయన హారతితో దర్శనాలు ముగుస్తాయని పేర్కొంది. అంతేకాదు, రోజుకు సగటున లక్ష నుంచి 1.5 లక్షల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది.
‘‘శ్రీ రామ జన్మభూమి మందిరంలో దర్శనం తర్వాత ప్రవేశం నుంచి నిష్క్రమణ వరకు మొత్తం ప్రక్రియ చాలా సులభం.. సౌకర్యవంతంగా ఉంటుంది. సాధారణంగా 60 నుంచి 75 నిమిషాల్లోపు దర్శనం పూర్తవుతుంది.. భక్తులు తమ సౌకర్యార్థం, సమయాన్ని ఆదా చేసుకునేందుకు తమ మొబైల్ ఫోన్లు, పాదరక్షలు, పర్సులు మొదలైన వాటిని మందిరం ప్రాంగణం వెలుపలే ఉంచాలని సూచిస్తున్నాం.. పుష్పాలు, దండలు, నైవేద్యం మొదలైనవాటిని తీసుకురావద్దని కోరుతున్నాం” అని తెలిపారు.
ఉదయం 4 గంటలకు మంగళహారతి, ఉదయం 6.15 గంటలకు శృంగార హారతి, రాత్రి 10 గంటలకు శయన హారతి ఉంటాయి. రాత్రి హారతికి మాత్రం ఎంట్రీ పాస్‌లు ఉండాలి. ఈ పాస్‌ల కోసం భక్తుల తమ పేరు, వయసు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్లు, నగరం సహ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ఈ పాస్‌లను శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్సైట్ నుంచి ఉచితంగా పొందవచ్చు.
ఆలయంలో ప్రత్యేక దర్శనాలకు ఎటువంటి ఏర్పాట్లు లేవు. ఏదైనా ప్రత్యేక పాస్‌లు జారీ వంటివి లేవు. ఒకవేళ దర్శనం కోసం డబ్బులు తీసుకుంటున్నట్టు వింటే అది బోగస్‌గా భావించాలి. దీంతో ఆలయ ట్రస్ట్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
దివ్యాంగులు, వయోవృద్ధులకు వీల్ఛైర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కేవలం రామమందిర ప్రాంగణంలో మాత్రమే ఉపయోగించగలరు. అయోధ్య నగరం లేదా మరే ఇతర మందిరాల్లో వినియోగించడం కుదరదు. వీల్ఛైర్లకు ఎటువంటి అద్దె వసూలు చేయరు. కానీ వాటిని నడిపేందుకు సహకరించే యువ వాలంటీర్ల కోసం నామమాత్రపు ఫీజు మాత్రం ఇవ్వాల్సి ఉంటుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎక్స్‌లో పేర్కొంది.