సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గడువులోగా ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం జమ్మూ కశ్మీర్లో బుధవారం పర్యటించిన ఆయన జమ్మూలో మాట్లాడుతూ బాండ్లు కొనుగోలుచేసిన వ్యక్తులు, వాటిని నగదుగా మార్చుకున్న రాజకీయ పార్టీల వివరాలను తమకు నిర్ణీత గడువులోగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందజేసిందని చెప్పారు.
ఆ సమాచారాన్ని పరిశీలించిన అనంతరం తాము కూడా వివరాలను అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించిన సమయం ప్రకారమే ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఉంచుతామని రాజీవ్‌కుమార్ వివరించారు. ఈ నెల 15న సాయంత్రం 5 గంటలు లోగా ఎన్నికల బాండ్ల వివరాలను ఈసీ వెబ్సైట్లో బహిర్గతం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.
ఎలక్టోరల్ బాండ్ల విషయంలో గడువును జూన్ 30 వరకూ పొడిగించాలన్న ఎస్బీఐ చేసిన విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తిరస్కరించింది. మార్చి 12 సాయంత్రంలోగా ఈసీకి వివరాలను వెల్లడించాల్సిందేనని ఆదేశించింది. దీంతో ఎన్నికల బాండ్ల వివరాలను ఈసీకి ఎస్బీఐ మంగళవారం సమర్పించింది.
తాము విక్రయించిన ఎన్నికల బాండ్లు, వాటిలో ఎన్నింటిని రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్నాయనే వివరాలను తెలియజేస్తూ ఎస్బీఐ బుధవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. 2019 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు 22,217 ఎన్నికల బాండ్లను జారీ చేసినట్లు తెలిపింది.
వాటిలో 22,030 బాండ్లను రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా వివరాలను పొందుపరుస్తూ ఎస్బీఐ ఛైర్మన్ దినేశ్‌కుమార్ పేరుతో అఫిడవిట్ దాఖలైంది. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం ఎన్నికల సంఘానికి అందజేసినట్లు తెలిపింది.