సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. భారతీయ స్టేట్ బ్యాంక్ సమర్పించిన డేటాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్బీఐ నుంచి వచ్చిన రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 15లోగా వెబ్సైట్లో పెట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది.
మొత్తం 763 పేజీలతో రెండు పార్ట్‌లుగా వెబ్సైట్ https://www.eci.gov.in/లో అప్లోడ్ చేసింది. ఎవరు ఎన్ని బాండ్లు? ఎంత మొత్తానికి కొనుగోలు చేశారనే వివరాలు ఇందులో ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ల వివరాల వెల్లడిలో పారదర్శకంగా ఉన్నట్లు ఈసీ తెలిపింది. పార్ట్-1లో ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు, పార్ట్-2లో బాండ్లను ఎన్‌క్యాష్ చేసుకున్న పార్టీల వివరాలతో పాటు తేదీ, మొత్తాలకు సంబంధించిన డేటాను పొందుపరిచారు.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు దాతలుగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్, మేఘా ఇంజినీరింగ్, పిరమల్ ఎంటర్ ప్రైజెస్, బారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, డీఎల్ఎఫ్ ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారిలో అపోలో టైర్స్, లక్ష్మీ మిట్టల్, ఎడెల్వీస్, పీవీఆర్, కెవెంటర్, సులా వైన్, వెల్స్పన్, సన్ ఫార్మాలు ఉన్నాయి.
హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్, ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో నిమగ్నమై ఉంది. ముఖ్యంగా ఇది రూ. 966 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. పీపీ రెడ్డి యాజమాన్యంలో, మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రధానంగా గ్యాస్ సంబంధిత కార్యకలాపాలలో నిమగ్నమై ఉంది.
భారత ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్లపై డేటాను విడుదల చేయడంతో, రాజకీయ పార్టీలకు సహకరించే కంపెనీలు, వ్యక్తులు వెల్లడయ్యారు. అయితే, పలు పార్టీలు ఊహించినట్లుగా అదానీ గ్రూప్, రిలయన్స్, టాటా వంటి ప్రధాన సంస్థల పేర్లు లేకపోవడం గమనార్హం. దీంతో బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఈ జాబితాలో అదానీ పేరు ఉంటుందని ఊహించారని, కానీ, లేకపోవడంతో అంతా సైలెంట్ అయ్యారని వ్యాఖ్యానిస్తున్నారు.
అత్యధిక బోండ్లు కొన్న శాంటియాగో మార్టిన్ చారిటబుల్ ట్రస్ట్ వెబ్సైట్ ప్రకారం ఆయన మయన్మార్‌లోని యాంగూన్‌లో సాధారణ కార్మికుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. 1988లో ఇండియాకు తిరిగి వచ్చి.. తమిళనాడులో లాటరీ వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కర్ణాటక, కేరళలో వ్యాపారాన్ని విస్తరించి.. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాడు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వ లాటరీ పథకాలను నిర్వహించడం ద్వారా తన వ్యాపారాన్ని విస్తరించుకున్నాడు శాంటియాగో మార్టిన్.
ఆ తర్వాత భూటాన్, నేపాల్‌లలో సంస్థలను ప్రారంభించడం ద్వారా ఇతర వ్యాపారాల్లోకి అడుగుపెట్టాడు. నిర్మాణం, రియల్ ఎస్టేట్, టెక్స్టైల్, హాస్పిటాలిటీ వంటి ఇతర వ్యాపారాల్లో లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ బిజినెస్ చేశాడని వెబ్సైట్ పేర్కొంది.