ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. మరోవైపు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఆమెకు శనివారం రిమాండ్ విధించింది. కస్టడీని కూడా ఈడీ అనుమతించింది. ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను పొందుపరిచారు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి, ప్రధాన సూత్రధారి అని చెబుతున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. పీఆర్వో రాజేష్‌తో పాటు మరో ముగ్గురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే వీరి ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అనిల్ వ్యాపార లావాదేవీలపై కూడా ఆరా తీసింది. ఈ నేపథ్యంలో తాజాగా నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని ఈడీ తెలిపింది. ఈ కేసులో మిగతా నిందితులు ఎవరనేది త్వరలోనే తెలియనుంది.
కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో బీజేపీకి సంబంధం లేదని పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. తమకు సంబంధం లేని విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు బీజేపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు సంస్థలు పనిచేస్తుంటే, దానిని రాజకీయాలతో ముడిపెట్టడం భావ్యం కాదని హితవు చెప్పారు.
‘‘బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, నదులకే నడక నేర్పారంటూ పొగిడారు.. నదులకు నడక సంగతి దేవుడెరుగు.. మద్యాన్ని మాత్రం ఢిల్లీకి తరలించారు’’ అని లక్ష్మణ్ ఒక ప్రకటనలో విమర్శించారు. మద్యం కుంభకోణంలో చట్టప్రకారమే ఈడీ చర్యలు చేపట్టిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఓడిస్తానన్న ఎమ్మెల్సీ కవిత.. ఇప్పుడు జైలులో నుంచి నామినేషన్ వేస్తుం దా..? అని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు.