టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ కూటమికి లోక్సత్తా మద్దతు ప్రకటించింది. ఎన్డీయే కూటమికి మద్దతిస్తున్నట్లు లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ బుధవారం ప్రకటించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందన్న జేపీ.. ప్రజలందరూ ఆలోచించి ఓటేయాలని కోరారు. భయం లేకుండా అందరూ పోలింగ్లో పాల్గొని.. సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా పాలన సాగించేవారిని ఎన్నికోవాలని సూచించారు.
“ఏపీలో రాజకీయ పరిస్థితులు దిగజారాయి. రాష్ట్రంలో కులాల మధ్య పోరాటం జరుగుతోంది. మంచి పరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదు. దానితో పాటు అభివృద్ధి కూడా కావాలి. అప్పులు తీసుకువచ్చి సంక్షేమం కోసం ఖర్చుపెట్టడం మంచిదికాదు.సంక్షేమం అంటే తాత్కాలిక ప్రయోజనం, అభివృద్ధి అంటే దీర్ఘకాలికంగా సంపద సృష్టించడం” అని జయప్రకాశ్ నారాయణ తెలిపారు.
ఏపీలోని ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఎన్నికలు సజావుగా సాగుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి ఒడిశా కన్నా దారుణంగా తయారైందని విమర్శించారు. ఏపీకి సుమారు వేయికోట్ల తీర ప్రాంతం ఉండి కూడా ఆదాయం పెంచుకోలేకపోయామని జయప్రకాష్ నారాయణ విమర్శించారు. ఏపీలోని సామాన్య ప్రజానీకం పరిస్థితి బాగుపడాలంటే సంక్షేమం, అభివృద్ధి సమతూకంతో పాలన అందించేవారిని ఎన్నుకోవాలని సూచించారు.
మరోవైపు జేపీ గతంలో వైఎస్ జగన్ పాలన మీద ప్రశంసలు కురిపించారు. విద్యా, వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను జేపీ గతంలో మెచ్చుకున్నారు. ఫ్యామిలీ డాక్టర్ వంటి విధానాలను సైతం ఆయన అభినందించారు. పేద ప్రజల సంక్షేమానికి కచ్చితంగా డబ్బు ఖర్చుపెట్టాలన్న జేపీ ఏపీలో మధ్యవర్తుల ప్రమేయం, లంచాల అవసరం లేకుండా చివరి గడపకు కూడా సంక్షేమ పథకాల లబ్ధి అందుతోందని గతంలో వ్యాఖ్యానించారు.
అలాగే వైఎస్ జగన్ను జేపీ ఓ సందర్భంలో కలవడంతో ఆయన వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఎన్డీయే కూటమికి మద్దతిస్తున్నట్లు జేపీ ప్రకటించారు మరోవైపు ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బిజేపీ కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. అధికార వైసీపీ ఒంటరి పోరుకే మొగ్గుచూపుతోంది. అటు కాంగ్రెస్, వామపక్షాలు కలిసి వెళ్లే ఆలోచన చేస్తున్నాయి.
తాజాగా లోక్సత్తా సైతం తాము ఎన్డీఏ కూటమికి మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. అయితే గతంలో కూడా జేపీ ఎన్డీయే పాలసీలకు అనుగుణంగా వ్యవహరించారు. పాత పెన్షన్ విధానాన్ని తీవ్రంగా వ్యతరేకించిన జేపీ.. అది టైంబాంబ్ లాంటిదన్నారు. టైం బాంబ్ పేలకముందే మేలుకొని, ఈ సంక్షోభానికి తక్షణ, ఆచరణసాధ్యమైన పరిష్కారాలను తక్షణం అమలు చేయాల్సి ఉందని గతంలో సూచించారు.