బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరో 3 రోజులు (ఈ నెల 26 వరకు) పొడిగించింది. ఈడీ అధికారులు ఐదు రోజుల కస్టడీకి కోరగా.. మూడు రోజులకు కోర్టు అనుమతించింది. కోర్టులోకి వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడుతూ తన అరెస్టు అక్రమమని, న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.
మరోవైపు సిబిఐ కోర్టులో బెయిల్ పిటిషన్ను కవిత తరఫు న్యాయవాది దాఖలు చేశారు. వెంటనే ఈడీకి నోటీసులు ఇవ్వాలని కోరారు. లిక్కర్ కేసుకు సంబంధించి ఏడు రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో శనివారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కవితను మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది.
ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం కవిత కస్టడీని మూడు రోజులు పొడిగించింది. అంతకుముందు తమ విచారణకు కవిత సహకరించడం లేదని ఈడీ ఆరోపించింది. సమీర్ మహీంద్రతో కలిపి కవితను ప్రశ్నించాలని తెలిపింది. లిక్కర్ స్కామ్ లో రూ.కోట్లలో కిక్ బ్యాక్లు అందాయని ఈడీ పేర్కొంది.
సౌత్గ్రూప్కు రూ.100కోట్లు చేరాయని ఆరోపించింది. కవిత ఫోన్ డేటాను తొలిగించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ కోర్టుకు తెలియజేసింది. అలాగే ఆమె కుటుంబ సభ్యుల వివరాలను ఇవ్వడం లేదని ఈడీ తరఫు లాయర్ ఆరోపించారు.
కవిత మేనల్లుడి వ్యాపారానికి సంబంధించిన వివరాలు అడినట్లు ఈడీ తెలిపింది. ప్రస్తుతం కవిత మేనల్లుడి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయని ఈడీ పేర్కొంది. కవితను ఆమె మొబైల్ ఫోన్కు సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ నివేదికతో విచారిస్తున్నామని ఈడీ తరఫు లాయర్ తెలియజేశారు. సోదాల్లో మేనల్లుడి ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.