లిక్కర్ కేసులో అరెస్టైన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. 10 రోజుల కస్టడీ ముగియడంతో ఇడి అధికారులు మంగళవారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపర్చారు. కవితను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు ఇవ్వాలని కోర్టును కోరారు ఇడి అధికారులు.
ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్ ఆన్లైన్లో వాదనలు వినిపించారు. 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని.. పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు కోర్టుకు వెల్లడించారు. దీంతో రిమాడ్ కు అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది కోర్టు. ఏప్రిల్ 9వ తేదీ వరకు కవితకు రిమాండ్ విధించింది. దీంతో కవితను తీహార్ జైలుకు తరలించనున్నారు పోలీసులు.
మరోవైపు, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరపు లాయర్లు ఢిల్లీ ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించారు. కవిత పిల్లలకు పరీక్షలు ఉన్నాయని.. కాబట్టి ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరు వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బెయిల్ పై విచారణ ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది.
ఇక ఇవాళ కోర్టుకు వెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు నుంచి కడిగిన ముత్యంలా తాను బయటికి వస్తానని అన్నారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు కానీ.. తమ ఆత్మస్థైర్యాన్ని ఎవ్వరూ దెబ్బతీయలేరని చెప్పారు.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరొక నిందితుడు బీజేపీ టికెట్ ఆశిస్తున్నాడని ఆమె పేర్కొన్నారు. మూడో నిందితుడు ఎలక్ట్రోలర్ బాండ్ల రూపంలో రూ.50 కోట్లు బీజేపీకి ఇచ్చాడని ఆరోపించారు. ఇది పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ కేసని, ఫాల్స్ కేసని కోర్టులోకి వెళ్తూ కవిత ఆరోపించారు. తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు కానీ.. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. త్వరలోనే బయటికి వస్తానని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.