అధికార పక్షం కనుసన్నలలో పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐఏఎస్ లు, ఆరుగురు ఐపీఎస్ అధికారులపై వేటు వేస్తూ ఎన్నికల కమిషన్ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్ , నెల్లూరు ఎస్పీ కె.తరములేశ్వర్ పై బదిలీ వేటు వేసింది.
బదిలీ అయిన అధికారులు తమ కింది వారికి తక్షణం బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని ఆదేశించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారి భర్తీకి ముగ్గురు ఆఫీసర్లతో ప్యానల్ పంపాలని ఈసీ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈసీ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు జిల్లా కలెక్టర్లు, ఐదుగురు ఎస్పీలు, ఒక ఐజీపై ఈసీ చర్యలు తీసుకుంది. కృష్ణా, అనంతపురం, తిరుపతి జిల్లాల ఎన్నికల అధికారులపై బదిలీ వేటు వేసింది.
బదిలీ అయిన అధికారులు
- పి.రాజాబాబు, ఐఏఎస్-డీఈవో, కృష్ణా జిల్లా
- ఎం.గౌతమి, ఐఏఎస్-డీఈవో, అనంతపురం జిల్లా
- లక్ష్మీశ, ఐఏఎస్-డీఈవో, తిరుపతి
- పరమేశ్వర్, ఐపీఎస్-ఎస్పీ, ప్రకాశం జిల్లా
- వై.రవి శంకర్ రెడ్డి,ఐపీఎస్- ఎస్పీ పల్నాడు జిల్లా
- పి.జాఘువా, ఐపీఎస్-ఎస్పీ, చిత్తూరు జిల్లా
- కేకేఎన్.అన్బురాజన్, ఐపీఎస్-ఎస్పీ,అనంతపురం జిల్లా
- కె.తిరుమళేశ్వర్, ఐపీఎస్-ఎస్పీ, నెల్లూరు జిల్లా
- జి.పాల రాజు, ఐపీఎస్-ఐజీపీ, గుంటూరు రేంజ్