ఐదేళ్లలోపు పిల్లలకు మాస్క్ అవసరంలేదని కేంద్రం నేడు స్పష్టం చేసింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, 18ఏళ్లలోపు వారికి సంబంధించి కేంద్రం సవరించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. 6 నుంచి 11 ఏళ్ల వయసు వారికి తల్లిదండ్రుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉపయోగించే మాస్కులు వాడాలని సూచించింది.
12 ఏళ్లు దాటిన వారికి మాస్క్ కచ్చితమని చెప్పింది. మరోవైపు 18ఏళ్ల లోపు వారికి అందించే చికిత్సకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు ప్రతిపాదించింది. వారికి ఇన్ఫెక్షన్ తీవ్రత ఎంత మేరక ఉన్నప్పటికీ యాంటీ వైరల్ లేదా మోనోక్లోనల్ యాంటీబాడీలు ఉపయోగించవద్దని ఆదేశించింది.
ఒకవేళ స్టెరాయిడ్లు వాడితే వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వాటిని 10 నుంచి 14 రోజులకు తగ్గించాలని స్ఫష్టం చేసింది. కరోనా లక్షణాలు కనిపించిన 3 నుంచి 5 రోజుల పాటు స్టెరాయిడ్లను వినియోగించకూడదని తేల్చిచెప్పింది.
కాగా, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,47,254 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,51,777 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 3,60,58,806కి పెరిగింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 5.23% కాగా.. కరోనా నుంచి రికవరీ అయిన వారి రేటు ప్రస్తుతం 93.50%కి చేరింది.
భారతదేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 20,18,825గా ఉంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 160.43 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు అందించబడ్డాయి. 9,692 మొత్తం ఒమైక్రాన్ కేసులు ఇప్పటివరకు కనుగొనబడ్డాయి. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షలు 71.15 కోట్లు కాగా.. గత 24 గంటల్లో 19,35,912 పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
ఢిల్లీలో వారాంతరం కర్ఫ్యూ ఎత్తివేత
ఇలా ఉండగా, ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ ఉండడంతో శని, ఆదివారాల్లో అమలు చేస్తున్న వారాంతరం కర్ఫ్యూ ఎత్తివేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను ఆమోదం కోసం లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపింది.
షాపులు, కమర్షియల్ కాంప్లెక్సులు తెరిచేందుకు ఇప్పటి వరకు అమల్లో ఉన్న సరి, బేసి విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ ఆఫీసులకు ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం అమలులో ఉండగా.. 50శాతం సామర్థ్యంతో పనిచేసేందుకు అనుమతించనుంది.
ఢిల్లీలో గురువారం 12,306 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య అంతకు ముందు రోజుతో పోలిస్తే 10.72 శాతం తక్కువ. పాజిటివిటీ రేటు తగ్గుతున్నందున ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలు సడలించాలని సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగానే వీకెండ్ కర్ఫ్యూను ఎత్తివేయాలని నిర్ణయించింది.