రామనుజచార్యుల 1000వ జయంతి సందర్భంగా హైదరాబాద్ కు సమీపంలోని ముచ్చింతల్ లో గల చిన్నజియ్యర్ స్వామిజీ ఆశ్రయంలో 216అడుగుల సమతామూర్తి విగ్రవిష్కరణకు అన్ని సన్నాహాలు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 5వ తేదీని ప్రధాని నరేంద్ర ఆవిష్కరించగా, 13న సమతా మూర్తి లోపల గర్భాలయాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించనున్నారు.
45 ఎకరాల విస్తీర్ణంలో సమతా మూర్తిని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం పేరిట ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. శ్రీరామనగరంలో ప్రధాన మందిరంలో 120 కిలోల బంగారంతో రూపొందించిన 54 అంగుళాల రామానుజ నిత్యపూజా మూర్తిని 13న రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ తొలి దర్శనంతో ప్రారంభిస్తారు.
216 అడుగుల ఎత్తైన రామానుజల మహా విగ్రహం చుట్టూ 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకం కొనసాగుతుంది. శ్రీవైష్ణవంలో దివ్యదేశాలుగా భావించే.. శ్రీరంగం, తిరుమల, కంచి, అహోబిలం, భద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, కుంభకోణం.. ఇలా మొత్తం 108 ప్రధాన వైష్ణవ గర్భాలయాల ఆకృతిలో ఆలయాలు, దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. ఆయా విగ్రహమూర్తులకు రంగులద్ది తుది మెరుగులు దిద్దే పనుల్లో నిమగ్నమయ్యారు.
ఈ క్రతువుకు దేశం నలుమూలల నుంచి 5 వేల మంది రుత్వికులు, వేద పండితులు పాల్గొననున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో రెండు దఫాలుగా యాగాలు కొనసాగుతాయి. నాలుగు దిక్కుల్లో 36 చొప్పున యాగశాలల సమూహం ఉంటుంది. మొత్తం 144 చోట్ల యాగాలు జరుగుతుంటాయి.
యాగశాలలను పూర్తిగా తాటి కమ్మలు, వెదురు బొంగులతో ఏర్పాటు చేశారు. మిగిలినవి సంకల్ప మండపం, అంకురార్పణ మండపం, నిత్యపారాయణ మండపాలు, రెండు ఇష్టశాలలు ఉన్నాయి. వీటిలో 1035 హోమ కుండాలు నిర్మించారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో నిత్యం కోటిసార్లు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని విన్పిస్తుంటారు.
హోమకుండలాల్లో వినియోగించేందుకు ఆవు పేడతో ప్రత్యేకంగా తయారు చేసిన పిడకలు వాడనున్నారు. ఇప్పటికే ఇదే ప్రాంగణంలో ప్రత్యేక యంత్రం సహాయంతో వీటిని తయారు చేసి ఎండకు ఆరబెట్టారు. ఎండిన పిడకలను ప్లాస్టిక్ కవర్లో భద్రపరిచి, హోమకుండలాల వద్దకు చేర్చే పనిలో నిమగ్నయయ్యారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి హోమకుండలంలో రోజుకు నాలుగు కేజీల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించనున్నారు. ఇలా ఒక్కో యాగశాలలోని తొమ్మిది హోమ కుండలాల్లో రోజుకు 72 కేజీల చొప్పున మొత్తం రెండు లక్షల కేజీల ఆవు నెయ్యిని రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని స్వచ్ఛమైన దేశీయ ఆవు పాల నుంచి సేకరించి తీసుకొచ్చారు.
సందర్శకులను ఆకర్షించే విధంగా ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించగానే సమతామూర్తికి ఎదురుగా 45 అడుగుల ఎత్తుతో ఉండే డైనమిక్ ఫౌంటెన్ స్వాగతం పలుకుతుంది. అష్టదశ పద్మాకృతితో ఉండే ఈ ఫౌంటెన్‌లో పద్మ పత్రాలు విచ్చుకునేలా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో రామానుజుల కీర్తనలు శ్రావ్యంగా విన్పిస్తుంటాయి. ప్రధాన ఫౌంటెన్ సహా ప్రధాన ఆలయం చుట్టు లేజర్‌షో, అత్యాధునిక లైటింగ్, సౌండ్ సిస్టం పనులు సైతం తుది దశకు చేరుకున్నాయి.
సమానత్వానికి వేయేళ్లపాటు ప్రతీకగా నిలిచినా రామానుజచార్యుల వారి బోధనలను మరో వెయ్యేళ్ల పాటు జనాలకు తెలియజెప్పేందుకే ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశామని చిన్నజియ్యర్ స్వామిజీ చెబుతున్నారు. .కూర్చుని ఉన్నఈ ప్రతిమ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విగ్రహంగా రికార్డుల్లోకి ఎక్కనుంది. కూర్చుని ఉన్న పొజిషన్ లో అతిపెద్ద విగ్రహంగా థాయ్ లాండ్ లోని బుద్ధుడి విగ్రహం పేరిట రికార్డుంది.
రామానుజచార్యుల విగ్రహాన్ని బంగారం, వెండి, రాగి, కంచు, జింక్ వంటి పంచలోహాలతో రూపొందించారు. విగ్రహం లోపల గర్భాలయాన్ని 120 కిలోల బంగారంతో నిర్మించారు. భూమిపై ఆయన 120 ఏళ్లు నడయాడినందుకు గుర్తుగా 120 కిలోల బంగారాన్ని వినియోగించారు. ప్రాజెక్టు కోసం రూ.వెయ్యి కోట్లు వెచ్చిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఇచ్చిన విరాళాలు, చందాలతో దానిని నిర్మిస్తున్నారు. 108 దివ్యదేశాలు, 108 విష్ణు ఆలయాలనూ ఇందులో నిర్మిస్తున్నారు.
8.9వ తేదీల్లో దేశ వ్యాప్తంగా ఉన్న సాధుసంతువులతో ‘‘ధర్మ సమ్మేళనం’’ నిర్వహిస్తారు. 10వ తేదీన సామాజిక సామారస్యత దృష్ట్యా ‘‘సామాజిక నేతల సమ్మేళనం’’ జరనున్నాయి. 9వ తేదీన ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ , 8,9,10 తేదీలలో భయ్యాజి జోషి, భాగయ్యలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు.