సోమవారం నుంచి పార్లమెంట్ భద్రత బాధ్యతలను కేంద్రీయ పారిశ్రామిక భద్రతా బలగాలు (సిఐఎస్ఎఫ్) చేపడుతాయి. దేశ ప్రజాస్వామ్య సౌధం భద్రతను ఇప్పటివరకూ పర్యవేక్షిస్తున్న 1400 మంది జవాన్లతో కూడిన సిఆర్‌పిఎఫ్‌ను ఈ విధుల నుంచి తప్పించారు. ఈ బలగాల స్థానంలో ఇప్పుడు 3300 మందితో కూడిన సిఐఎస్ఎఫ్ దళాలను రంగంలోకి దింపుతున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు.
నూతన పార్లమెంట్ ఆవరణ భద్రతా పర్యవేక్షణ బాధ్యతల్లో ఉన్న సిఆర్‌పిఎఫ్‌కు చెందిన పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ (పిడిజి) శుక్రవారమే ఈ ప్రాంతం నుంచి తమ పర్యవేక్షక బాధ్యతల నుంచి వైదొలిగింది. ఈ బలగాలకు చెందిన కార్యనిర్వాహక వ్యవస్థ అనుబంధం అయిన వాహనాలు, ఆయుధాలు , కమెండోలు తమ కార్యకలాపాలను ముగించాయి.
ఈ బలగాల సారధ్య బాధ్యతల్లో ఉన్న డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారి ఒకరు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని సెక్యూరిటీ పాయింట్స్‌ను లాంఛనంగా సిఐఎస్ఎఫ్ బృందానికి అప్పగించారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఇకపై మొత్తం మీద 3317 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది డ్యూటీలు తీసుకుంటారు.
వీరు పాత, కొత్త పార్లమెంట్, అనుబంధ భవనాల భద్రతను పర్యవేక్షించాల్సి ఉంటుంది. సెంట్రల్ ఢిల్లీలోని పార్లమెంట్ భవనం ఆవరణలో గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ విషయంపై సీరియస్ అయింది. ఈ క్రమంలో సిఆర్పిఎఫ్ నుంచి ఈ బాధ్యతలను తప్పించి సిఐఎస్‌ఎఫ్‌కు అప్పగించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బలగాల మార్పిడి జరుగుతోందని వెల్లడైంది.