హైదరాబాద్ లో చేపమందు పంపిణీకి బత్తిని కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జూన్ 8, 9 తేదీల్లో చేప మందు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. చేప మందు కోసం వచ్చే వారికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఉబ్బసం, ఆస్తమా, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప మందు లేదా చేప ప్రసాదాన్ని ఏటా బత్తిని కుటుంబ సభ్యులు ఉచితంగా పంపిణీ చేస్తారు.
చేప మందుతో శ్వాస సంబంధ వ్యాధులు తగ్గుతాయని చాలా మంది నమ్ముతారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు చేప మందు కోసం వస్తారు. ఏటా మృగశిర కార్తె రోజున హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబ సభ్యులు చేప మందు పంపిణీ చేస్తుంటారు.
1847లో హైదరాబాద్ సంస్థానంలో చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. అప్పట్లో వీరన్న గౌడ్ అనే వ్యక్తి ప్రతి మృగశిర కార్తె ముందు రోజు నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆయన తర్వాత వారి కుమారుడు బత్తిని శివరామ గౌడ్, అతని కుమారుడు బత్తిని శంకర్‌గౌడ్ ఈ ప్రసాదాన్ని ఏటా పంపిణీ చేశారు.
శంకర్‌గౌడ్, సత్యమ్మ దంపతుల ఐదుగురు కుమారుల్లో బత్తిని హరినాథ్ గౌడ్, బత్తిని ఉమామహేశ్వర్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు కలిసి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. గత 177 ఏళ్లుగా చేప మందు పంపిణీ కొనసాగుతోంది. కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీ రెండేండ్ల పాటు నిలిచిపోయింది. గత ఏడాది నుంచి చేప మందుకు కోసం వచ్చేవారికి ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. 2023లో వయో భారంతో బత్తిని హరినాథ్ గౌడ్ మృతి చెందారు.
చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు చేపమందు ఎవరైనా వేసుకోవచ్చని, గర్భిణులు మాత్రం తీసుకోవద్దని బత్తిని కుటుంభ సభ్యులు సూచించారు. పరగడుపున లేదా భోజనం తీసుకున్న మూడు గంటల తర్వాత మందు తీసుకోవాలని చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీకి కౌంటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.