దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు స్కూల్స్, ఆస్పత్రులకే పరిమితమైన బాంబు బెదిరింపులు ఇప్పుడు ఏకంగా కేంద్ర హోంశాఖ కార్యాలయానికి వచ్చాయి. నార్త్ బ్లాక్‌లోని కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యాలయాన్ని పేల్చివేస్తామని ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు ఈమెయిల్‌ను దుండగులు పంపించారు.
బాంబు బెదిరింపులతో అప్రమత్తమైన సాయుధ బలగాలు విస్తృత స్థాయి తనిఖీలు చేపట్టాయి. నార్త్ బ్లాక్ నుంచి ఉద్యోగులను బయటకు వెళ్లిపోవాల్సిందిగా సాయుధ బలగాలు సూచించాయి. దీంతో వారంతా వెంటనే బయటకు వెళ్లిపోయారు.
ఇక, హోం శాఖ కార్యాలయం పరిసర ప్రాంతాలను సాయుధ భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లే మార్గాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. విజయ్ చౌక్, నార్త్ అవెన్యూ మార్గాల్లో అగ్నిమాపక యంత్రాలను ఢిల్లీ పోలీసులు సిద్ధం చేశారు. మరోవైపు, డాగ్ స్క్వాడ్, బాంబు నిర్వీర్య బృందాలు అక్కడికి చేరుకుని విస్తృత తనిఖీలు చేపట్టాయి. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి అనుమానిత వస్తువులు గుర్తించలేదని అధికారులు వెల్లడించారు.
కాగా, ఇటీవల ఢిల్లీలోని పలు విద్యాలయాలకు, ఆస్పత్రులకు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు, సాయుధ బలగాలు విస్తృత తనిఖీలు చేపట్టి అలాంటిదేమీ లేదని తేల్చారు. తాజాగా, బెదిరింపులకు దిగిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.