కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని కన్సార్షియం (ఇన్సాకాగ్) తెలిపింది. వైరస్ల జన్యుక్రమాన్ని ఈ సంస్థలు విశ్లేషిస్తుంటాయి. ఢిల్లీ, ముంబయి నగరాల్లో అధికంగా వైరస్ వ్యాప్తి చెందిందని వెల్లడించింది.
విదేశీ ప్రయాణికుల నుండి వ్యాపించే దానికన్నా దేశీయంగా అంతర్గత వ్యాప్తే అధికంగా ఉన్నట్లు అంచనా వేసింది. వ్యాక్సిన్ పొందిన ప్రయాణికుల్లో మొదట ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించడం జరిగింది.
ఈ వేరియంట్ సోకినా ప్రస్తుతం చాలా మందిలో వైరస్ లక్షణాలు బహిర్గతం కావడంలేదు. మరి కొందరిలో స్వల్ప స్థాయి లక్షణాలే కనిపిస్తున్నాయి. అయితే, వ్యాక్సిన్ తీసుకోని వారు, హైరిస్కు ఉన్న వ్యక్తులు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.
వ్యాప్తి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం తక్కువేనని, ప్రాణాపాయ ముప్పు కూడా స్వల్పమేనని పేర్కొంది. అయినప్పటికీ ఒమిక్రాన్‌ను నిర్లక్ష్యం చేయడం తగదని, తగు రక్షణ విధానాలను పాటించాల్సిందేనని ఇన్సాకాగ్ స్పష్టంచేసింది.
ఇలా ఉండగా, కర్నాటకలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రోజువారీ కేసులు సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కర్నాటకలోఒక్క రోజులోనే కరోనా బారినపడిన వారి సంఖ్య 50వేల మార్కు దాటింది. ఒక్క బెంగళూరులోనే 26,299 మంది కరోనా బారినపడ్డారు.
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరగడమే తప్ప తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 46 వేల 650 మందికి పరీక్షలు చేయగా 14 వేల 440 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. కరోనా సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో నలుగురు మరణించారు.
ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9197 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 13510 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కోవిడ్ బారిన పడి 24 మంది చనిపోయారు.
ఇలా ఉండగా, భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గినా, వరుసగా నాలుగో రోజు కూడా 3 లక్షలకు మించి కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,06,064 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోల్చితే 27,469 కేసులు తగ్గాయి. తాజాగా కరోనా బారిన పడి 439 మంది మరణించారు. ఇక మరో రెండు లక్షల 43వేల 495 మంది కరోనా బారిన పడి మరణించారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 22 లక్షల 49వేల 335 యాక్టివ్ కేసులు ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉంది. మరోవైపు భారత్ లో కరోన నిర్ధారణ పరీక్షలు 71.69 కోట్లు దాటినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 14,74,753 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించారు.
ప్రస్తుతం నమోదు అవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా ఓమిక్రాన్ బాధితులు ఉన్నారు. ఇక సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశ వ్యాప్తంగా 162.26 కోట్ల వాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది. దేశంలో రికవరీ రేటు 93.07% శాతానికి చేరుకోగా వారంవారీ పాజిటివిటీ రేట్ 17.03% శాతంగా నమోదు అయింది.