సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని, గనులు కేటాయించకపోతే భవిష్యత్తులో సింగరేణి మూతపడే పరిస్థితి తలెత్తుతుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన విజ్ఞప్తిపై కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై ప్రధానమంత్రితో మాట్లాడుతామని హామీ ఇచ్చారు.
పదో విడత బొగ్గు గనుల వేలం ప్రక్రియను హైదరాబాద్ వేదికగా కిషన్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా 60 బొగ్గు గనుల బ్లాక్‌లను కేంద్రం వేలానికి ఉంచింది. వీటిని దక్కించుకునేందుకు బిడ్డర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క సింగరేణి గనులకు సంబంధించి పలు అంశాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
సింగరేణికి వేలంలో రిజర్వేషన్ కల్పించాలని, సింగరేణికి కేంద్రం సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉందని విక్రమార్క తెలిపారు. సింగరేణి సంస్థ కొంగు బంగారం వం టిదన్న భట్టి 130 ఏళ్ల అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు కొత్త బ్లాక్‌లు కేటాయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వేలం పెట్టిన శ్రావణపల్లి గనిని సింగరేణికే ఇచ్చే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి వేలంలో రిజర్వేషన్లను కల్పించే విధంగా చొరవ చూపాలని భట్టి కోరారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నష్టం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. భట్టి విక్రమార్క లేవెనెత్తిన పలు అంశాలపై దృష్టిసారిస్తామని చెప్పారు. ఒడిశా నైనీ కోల్ బ్లాక్‌లో సింగరేణికి లాభం చెందే విధంగా చేస్తామని తెలిపారు. త్వరలో ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలతో మాట్లాడుతామన్న ఆయన కొత్త బొగ్గు గనుల వేలాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలతోనే చేస్తున్నామని స్పష్టం చేశారు.
సింగరేణి కార్మికులకు కేంద్రం అన్యాయం చేయదని కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. తాజాగా జరుగుతున్న పదో వేలంలో మొత్తం 60 బొగ్గు బ్లాకులు ఉన్నాయి. అత్యధికంగా ఒడిశాకు చెందిన 16 బ్లాకులు, ఛత్తీసగఢ్‌కు చెందిన 15, జార్ఖండ్ – 6, బిహార్, పశ్చిమ బెంగాల్‌లకు చెందిన చెరో 3 బ్లాకులను వేలం వేస్తున్నారు. ఇక తెలంగాణ నుంచి చూస్తే ఒక శ్రావణపల్లి మాత్రమే జాబితాలో ఉంది.
ఈ బ్లాకులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గతంలో సింగరేణి నిర్వహించిన అన్వేషణలో తేలింది. ఈ బ్లాకును దక్కించుకోవడానికి సింగరేణి కూడా తొలిసారి వేలంలో పాల్గొన్నది. ఈ బ్లాక్ ను సింగరేణికే ఇవ్వాలని భట్టి కోరిన నేపథ్యంలో ఈ బ్లాక్ ఎవరికి దక్కబోతుందనేది ఉత్కంఠగా మారింది. ఈ బ్లాక్ ఎలాగైనా దక్కించుకోవాలని సింగరేణి యాజమాన్యం గట్టిగా భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని చేజారనీయవద్దని దక్కకపోతే ఉత్పత్తికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది.