ఆస్ట్రేలియాపై టీమిండియా ప్రతీకార విజయం సాధించింది. గతేడాది వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఓడించి టైటిల్‌ను దూరం చేసిన ఆసీస్‌ను.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2024 కీలక మ్యాచ్‌లో భారత్ చిత్తుచేసింది. కాస్త రివేంజ్ చీర్చుకుంది. అలాగే, సూపర్ 8లో మూడింట మూడు గెలిచి సెమీఫైనల్‌కు టీమిండియా దూసుకెళ్లింది.
సెయింట్ లూసియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2024 గ్రూప్1 సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌ల్లో భారత్ సెమీస్ చేరడం ఇది ఐదోసారి. సెమీస్ రేసులో నిలవాలంటే ఆ జట్టుకు అత్యంత కీలకమైన మ్యాచ్‌లో కంగారూలను 24 పరుగుల తేడాతో ఓడించింది.
చాలాకాలం తర్వాత భారత సారథి రోహిత్ శర్మ (41 బంతుల్లో 92, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) తనలోని ‘హిట్‌మ్యాన్’ను బయటకు తీసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 31, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 27 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు) వేగంగా ఆడారు.
భారీ ఛేదనలో ఆస్ట్రేలియా దీటుగానే బదులిచ్చింది. ట్రావిస్ హెడ్ (43 బంతుల్లో 76, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) మరోసారి భారత్ పాలిట విలన్‌గా మారినా చివర్లో మన బౌలర్లు రాణించి ఆసీస్‌ను దెబ్బకొట్టడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 181/7కే పరిమితమైంది. రోహిత్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
భారీ ఛేదనలో ఆసీస్ మొదటి ఓవర్లోనే డేవిడ్ వార్నర్ (6) వికెట్ కోల్పోయింది. కానీ ఐసీసీ టోర్నీలలో ‘భారత్‌కు విలన్’గా మారిన ట్రావిస్ హెడ్ మరోసారి రెచ్చిపోయాడు. ఆసీస్ సారథి మిచెల్ మార్ష్ (37) తో కలిసి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అర్ష్‌దీప్ 3వ ఓవర్లో మార్ష్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను వదిలేయడంతో అతడికి లైఫ్ దక్కింది. అదే ఓవర్లో అతడు 4,6 కొట్టాడు.
ఇక బుమ్రా వేసిన 4వ ఓవర్లో హెడ్ 3 బౌండరీలతో బాదుడుకు శ్రీకారం చుట్టాడు. హార్దిక్‌ను లక్ష్యంగా చేసుకున్న హెడ్.. అతడి బౌలింగ్‌లో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కుల్దీప్ 9వ ఓవర్లో మార్ష్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద అక్షర్ అద్భుతంగా అందుకోవడంతో 81 పరుగులు రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
హార్దిక్ 9వ ఓవర్లో 3 ఫోర్లతో హెడ్ 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. ఉన్నంతసేపు మెరుపులు మెరిపించిన మ్యాక్స్‌వెల్ (20)ను కుల్దీప్ బౌల్డ్ చేశాడు. స్టోయినిస్ (2)ను అక్షర్ బోల్తా కొట్టించాడు.
ఆసీస్‌ను లక్ష్యం దిశగా తీసుకెళ్తున్న హెడ్‌ను ఆపేందుకు రోహిత్ వ్యూహం మార్చి బుమ్రాకు బంతినందించాడు. 17వ ఓవర్లో బుమ్రా వేసిన మూడో బంతిని షాట్ ఆడబోయినా అది మిస్ అయినా కవర్స్‌లో రోహిత్ మాత్రం క్యాచ్‌ను మిస్ చేయలేదు. తర్వాతి ఓవర్లోనే వేడ్ (1)తో పాటు ప్రమాదకర టిమ్ డేవిడ్ (15)ను అర్ష్‌దీప్ ఔట్ చేయడంతో ఆసీస్ ఓటమి ఖరారైంది.
