జమ్మూ డివిజన్లోని దోడా జిల్లాలో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గండోహ్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలను హతమార్చాయి. కాల్పుల్లో సైనికుడు గాయపడగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంతో పాటు పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నది. ఉగ్రవాదుల కోసం దోడా ప్రాంతంలో గత కొద్దిరోజులు నిరంతరంగా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
అనుమానిత వ్యక్తుల సమాచారంపై సమాచారం అందినా తనిఖీలు చేపట్టగా లాభం లేకపోయింది. ఈ క్రమంలో ఎన్కౌంటర్ ప్రాంతంలో మళ్లీ అనుమానితులు కనిపించగా.. బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు బలగాలపైకి కాల్పులు జరిపారు. దాంతో బలగాలు సైతం దీటుగా బదులిచ్చింది.
దోడా ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌పై ఆర్మీకి చెందిన వైట్‌నైట్ కార్ప్స్ సమాచారం అందించింది. సైనిక ఆపరేషన్‌కు ‘లాగోర్’ అని పేరు పెట్టింది. పక్కా సమాచారం మేరకు భాదేర్వా సెక్టార్‌లోని గండోహ్లో సైన్యం, పోలీసుల సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొంది.
ఇదిలా ఉండగా ఈ నెల 11న అర్ధరాత్రి భదేర్వా తహసీల్‌లోని ఛత్రగలన్లోని చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు ఆర్మీ సిబ్బంది, ఒక ఎస్పీఓ (స్పెషల్ పోలీస్ ఆఫీసర్) గాయపడ్డారు. 9న రియాసి జిల్లాలో ఉగ్రవాదులు భారీ ఉగ్రదాడికి ఒడిగట్టారు.
కత్రా వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇందులో తొమ్మిది మంది భక్తులు మృతి చెందగా.. 50 మంది గాయపడ్డారు. మరుసటి రోజు సాంబాలోని ఓ ఇంటిపై దాడికి దిగారు. ఎన్కౌంటర్లో ఇద్దరు పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ డివిజన్లో ఈ మూడు దాడిఘటనల అనంతరం సైన్యం భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నది. డివిజన్లోని వివిధ జిల్లాల్లోని అటవీ, కొండ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.