రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజన కావిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రములో గల 13 జిల్లా పరిషద్ లను మాత్రం అదే విధంగా కొనసాగించేందుకు ఆలోచిస్తున్నది.
ఈ మధ్యనే జిల్లా పరిషద్ ఎన్నికలు జరగడం, అన్నింట్లో అధికార పక్షమే ఆధిపత్యం వహిస్తూ ఉండడంతో, ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకొనే వరకు అదే విధంగా కొనసాగించాలని చూస్తున్నారు.
తెలంగాణాలో 10 జిల్లాలను 31 జిల్లాలుగా మార్చినప్పుడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరావు అదే విధంగా చేశారు. వెన్యూపరమైన అంశాల ప్రాతిపదికనే జిల్లాలను విభజిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేయడంతో కొత్తగా ఏర్పడే జిల్లాలకు కొత్త జిల్లా పరిషద్ పాలకవర్గాలు ఏర్పడే అవకాశాలు కనిపించడం లేదు
.రాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్‌లకు గతేడాది సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగ్గా, అక్టోబర్‌లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. జిల్లాల విభజన కార్యరూపం దాల్చినప్పటికీ, జెడ్పి చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌లసహా పాలకవర్గాలు ఐదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉందని పంచాయతీరాజ్ నిపుణులు చెబుతున్నారు.
పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు కొత్త పాలకవర్గాలు ఏర్పడిన తర్వాత జిల్లాలు లేదా మండలాల విభజన జరిగితే, ఆయా జిల్లాల్లో పాత పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన తర్వాతే కొత్త జిల్లాలకు పాలకవర్గాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికే తొమ్మిది జిల్లా పరిషత్‌లకు 2013లో పాలకవర్గాలు ఏర్పడ్డాయి. టిఆర్ఎస్ పార్టీ కొత్త జిల్లాల హామీతోనే ఎన్నికలకు వెళ్లింది. కొత్త ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం 2016లో 31 జిల్లాలకు ప్రాథమికంగా నోటిఫికేషన్ ఇచ్చింది.
వాటిపై నెల రోజులపాటు అభ్యంతరాల స్వీకరించిన అనంతరం, అదే ఏడాది అక్టోబర్ నుంచి ఆ జిల్లాల్లో పరిపాలన ప్రారంభించింది. 31 జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ, తొమ్మిది జిల్లా పరిషత్‌లనే కొనసాగించారు. వాటి పదవీకాలం పూర్తయిన తర్వాత, కొత్త జిల్లాల వారీగా జెడ్పిటిసి, ఎంపిటిసిలకు ఎన్నికలను నిర్వహించారు.
ఇలా ఉండగా, కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ, వాటికి కేంద్ర ఆమోదం పొందాల్సిందే. తెలంగాణలో పది జిల్లాలను 33గా విభజించినప్పటికీ, కేంద్రప్రభుత్వ గెజిట్ ప్రకారం పది జిల్లాలే కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఆ జిల్లాలకే కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తోంది.
చివరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం పది జిల్లాలకే ఎన్నికల పరిశీలకులను పంపించింది. ఇదే విధానం రాష్ట్రంలోనూ అమలవుతుందని పంచాయతీరాజ్ నిపుణులు చెబుతున్నారు. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు కూడా పాత జిల్లాల వారీగానే నిధులు మంజూరవుతాయని తెలిపారు.
మరోవంక, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డిసిసిబి), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలు (డిసిఎంఎస్) కూడా పాతవే కొనసాగనున్నాయి. తెలంగాణలో పరిపాలనాపరంగా 33 జిల్లాలు ఉన్నప్పటికీ, డిసిసిబి, డిసిఎంఎస్‌లు మాత్రం పాత జిల్లాల వారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ప్రస్తుతం 13 జిల్లాల్లో ఉన్న డిసిసిబి, డిసిఎంఎస్లే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.