రాబోయే బడ్జెట్లో పొగాకు ఉత్పత్తులపై పన్ను పెంచుతారనే ఊహాగానాల మధ్య స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్జేఎం) ఆర్థిక విభాగం ‘బీడీలు’, చిన్న చేతితో చుట్టే సిగరెట్లపై సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరింది.
‘టెండు’ ఆకులతో చుట్టబడిన పొగాకు, తరచుగా పేదవాడి సిగరెట్‌గా పిలువబడుతుందని గుర్తు చేసింది. ఇప్పటికే బీడీలపై 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారని గుర్తు చేస్తూ, ఇంకా పన్ను పెంచితే యువతను నక్సల్స్ వైపు నెట్టివేసిన్నట్లు కాగలదని హెచ్చరించింది.
సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టంకు ప్రతిపాదించిన సవరణల పరిధి నుండి ‘బీడీలను’ కూడా దూరంగా ఉంచాలని ఎస్జేఎం కో-కన్వీనర్ అశ్వనీ మహాజన్ డిమాండ్ చేశారు. ఈ పరిశ్రమలో లక్షలాది మంది కార్మికులు ఉన్నారని చెబుతూ బీడీలపై పన్ను పెంపుదల వారిని జీవనోపాధిని కోల్పోయేటట్లు చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దానితో వారిలో చాలా మందిని నక్సలిజం వైపు నెట్టవచ్చని స్పష్టం చేశారు.
“బీడీ పరిశ్రమ దేశంలో 4-4.5 కోట్ల మందికి ఉపాధి, జీవనోపాధిని కల్పిస్తున్నది. ఈ కార్మికులలో ఎక్కువ మంది పేద కుటుంబాల మహిళలు. వారు వీటి ఉత్పత్తిలో ఉపయోగించే ‘టెండు’ ఆకులను సేకరించే వారు,” అని ఆల్ ఇండియా బీడీ ఇండస్ట్రీ ఫెడరేషన్ నిర్వహించిన వర్చువల్ ఈవెంట్లో మాట్లాడుతూ మహాజన్ చెప్పారు.
ప్రతిపాదిత మార్పులు, బీడీ తయారీ పరిశ్రమను కూడా గణనీయంగా ప్రభావితం చేస్తాయని ఆయన చెప్పారు. ఎందుకంటే ఏదైనా పొగాకు ఉత్పత్తిని తయారు చేయడానికి, విక్రయించడానికి, పంపిణీ చేయడానికి లైసెన్స్‌లు, అనుమతులు, రిజిస్ట్రేషన్లను పొందడం తప్పనిసరి అవుతుందని ఆయన తెలిపారు.
బీడీ వినియోగాన్ని తగ్గించే చర్యలను తీసుకురావడానికి ముందు పరిశ్రమపై ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి, జీవనోపాధి ఎంపికలను ప్రభుత్వం సృష్టించాలని ఆయన ప్రభుత్వంకు హితవు చెప్పారు. ‘బీడీలు’, సిగరెట్ల ధూమపానం ప్రభావాన్ని నిర్ధారించడానికి తులనాత్మక శాస్త్రీయ అధ్యయనాన్ని జరపాలని ఆయన కోరారు.
పొగాకు పన్ను విధానం కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి, పొగాకు నియంత్రణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్‌కు అనుగుణంగా భారతదేశాన్ని రూపొందించడానికి తక్షణ చర్యలను సిఫార్సు చేయడానికి ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌లో తొమ్మిది మంది సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.