గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. సౌరాష్ట్ర ప్రాంతంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తుతోంది. పలు నగరాల్లో ప్రధాన రహదారులపై నడుము లోతు నీరు చేరింది. ఇక ఈ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
మోర్బి, వడోదర, ఖేడా, భరూచ్, అహ్మదాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించగా.. గాంధీనగర్, మహిసాగర్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ఆనంద్‌లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 23,870 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 1,696 మందిని సహాయక బృందాలు కాపాడాయి.
వడోదర, పంచమహల్స్ జిల్లాలు ఈ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆ జిల్లాల నుంచి 12 వేల మందికిపైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందులో వడోదరలో 8,361 మంది, పంచమహల్స్‌లో 4,000 మంది ఉన్నారు. గత రెండు రోజుల్లో నవ్సారిలో 1,200 మందిని, వల్సాద్‌లో 800 మందిని, భరూచ్‌లో 200 మందిని, ఖేడాలో 235 మంది, బొటాడ్ జిల్లాలో 200 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మరోవైపు దేవభూమి ద్వారక, ఆనంద్, వడోదర, ఖేడ, మోర్బి, రాజ్‌కోట్ జిల్లాల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. వర్షాల ధాటికి సురేందర్‌నగర్ జిల్లాలో ఓ బ్రిడ్జి కూలిపోయింది.
వడోదరలో విశ్వమిత్ర నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో పెరగడంతో నగరంలోని ఏడు వంతెనలను అధికారులు మూసివేశారు. నది పక్కనే ఉన్న అనేక ఇళ్లు నీట మునిగాయి. డైమండ్ సిటీ సూరత్‌లోనూ లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.