జమ్ముకశ్మీర్లో మరోసారి కాల్పుల మోత కలకలం రేపింది. అక్కడ వరుసగా ఎన్ కౌంటర్లు జరగడం కలవరం రేపుతోంది.జమ్మూకశ్మీర్లోని కిష్టవార్లో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు కథువాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను రైజింగ్ స్టార్ కార్ప్స్ హతమార్చారు.
కిష్టవార్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చిందని, దాని ఆధారంగా చాట్రూ ప్రాంతంలో ఆపరేషన్ చేపట్టారు. 15.30 నిమిషాల సమయంలో ఉగ్రవాదుల ఆచూకీ చిక్కిందని, ఆ సమయంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు మరణించినట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం అక్కడ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు ఆర్మీ వెల్లడించింది.
కిష్టవార్ ఎన్కౌంటర్లో పాల్గొన్న ఉగ్రవాదులే జూలైలో దోడాలో జరిగిన ఎన్కౌంటర్లో పాల్గొన్నారు. అక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు సైనికులు మృతిచెందిన విషయం తెలిసిందే. మరోవైపు కిశ్త్వాడ్ జిల్లాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో నలుగురు సైనికులు గాయ పడ్డారు. ఈ విషయాన్ని సైనిక వర్గాలు వెల్లడించాయి. మరి కొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లోనే ఈ ఎన్కౌంటర్లు జరగడం గమనార్హం.
కశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ చోటుచేసుకోవడం శాంతిభద్రతల సమస్యగా మారింది. సెప్టెంబర్ 18వ తేదీన దోడా, కిష్టవార్, రాంబన్, అనంతనాగ్, పుల్వామా, సోఫియాన్, కుల్గామ్ జిల్లాల్లో పోలింగ్ జరగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జమ్మూకశ్మీర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జమ్మూ, కథువాలో సెప్టెంబర్ 25, సాంబా జిల్లాలో అక్టోబర్ ఒకటో తేదీన పోలింగ్ జరగనున్నది.