ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వేదికగా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. సీమాంతర తీవ్రవాదాన్నే ఆయుధంగా మార్చుకుని పొరుగు దేశాలపై దాడి చేసే ఆ దేశం ఈనాడు హింస గురించి, భారత్ గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా సంభవించిన తీవ్రవాద దాడుల్లో పాక్ జాడలు, మూలాలు వున్నాయని భారత్ పేర్కొంది. భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర తీవ్రవాదానికి పాల్పడితే విపత్కర పర్యవసానాలు తప్పవని ఆ దేశం గుర్తించాలని స్పష్టం చేసింది. పాకిస్తాన్ శుక్రవారం చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలను భారత్ తిప్పికొట్టింది. ఇందుకు గాను రైట్ టు రిప్లై ను ఉపయోగించుకుంది.
శుక్రవారం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, జమ్ము కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. 370వ అధికరణ రద్దును భారత్ వెనక్కి తీసుకోవాలన్నారు. కాశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి చర్చలు జరపాలని కోరారు. పాక్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ భారత్ ప్రతినిధి భవికా మంగళానందన్ మాట్లాడారు.
‘ఈ జనరల్ అసెంబ్లీ నేటి ఉదయం ఒక అపహాస్యానికి వేదికగా నిలిచింది. సైన్యం మద్దతుతో పాలన సాగించే ఈ దేశం, తీవ్రవాదానికి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నేరాలకు అంతర్జాతీయంగా గుర్తింపును తీసుకువచ్చిన ఈ దేశం… ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌పై దాడికి దిగడం విడ్డూరంగా వుంది.’ అని భారత దౌత్యవేత్త భవిక పేర్కొన్నారు.
పాకిస్తాన్ సీమాంతర తీవ్రవాదాన్ని పొరుగుదేశాలపై ఒక ఆయుధంగా ఉపయోగిస్తుందని యావత్ ప్రపంచానికి తెలుసునని అన్నారు. మన పార్లమెంట్‌పై, ఆర్థిక రాజధాని ముంబయిపై, మార్కెట్ స్థలాలు, యాత్రా మార్గాలపై దాడికి పాల్పడిందని ఆమె విమర్శించారు. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత వుందన్నారు. అటువంటి దేశం ఎక్కడైనా హింస గురించి మాట్లాడటమనేది ఆత్మ వంచన తప్ప మరొకటి కాదని భవిక పేర్కొన్నారు.
‘మరిన్ని అబద్ధాలు, అసత్యాలతో వాస్తవాలపై దాడి చేయాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. పదే పదే చెప్పడం వల్ల మార్పేమీ వుండదు. భారత్ వైఖరి చాలా స్పష్టంగా వుందని, ప్రతీసారీ పునరుద్ఘాటించాల్సిన అవసరం లేదని’ భారత్ తేల్చి చెప్పింది. రిగ్గింగ్ ఎన్నికల చరిత్ర కలిగిన ఆ దేశం రాజకీయ ఎంపికల గురించి అది కూడా ప్రజాస్వామ్య దేశం గురించి మాట్లాడడం చాలా వింతగా వుందన్నారు.