వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయం పన్ను రిటర్న్(ఐటిఆర్) ఫామ్లో క్రిప్టోకరెన్సీ ఆదాయానికి సంబంధించిన ప్రత్యేక కాలమ్ ఉంటుందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి క్రిప్టో అసెట్స్ లావాదేవీలపై 30 శాతం పన్నుతో పాటు సెస్, సర్చార్జీ విధిస్తారు.
గుర్రపు పందేలు, ఇతర స్పెక్యులేటివ్ లావాదేవీల నుంచి వసూలు చేసే విధంగానే ఈ క్రిప్టోపై పన్నును విధించారు. తరుణ్ బజాజ్ మాట్లాడుతూ, కొత్త ఆర్థిక సంవత్సరంలో ఐటిఆర్ ఫామ్లో క్రిప్టోకరెన్సీ నుండి లాభం, పన్ను చెల్లింపు కోసం ప్రత్యేక కాలమ్ ఉంటుందని అన్నారు. ఈ కాలమ్లో క్రిప్టో కరెన్సీ సంపాదన గురించిన సమాచారం వెల్లడించాల్సి ఉంటుంది. క్రిప్టోకరెన్సీ లాభాలపై ఎల్లప్పుడూ పన్ను ఉంటుందని, బడ్జెట్లో ప్రతిపాదించినది కొత్త పన్ను కాదని స్పష్టం చేశారు.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2022లో క్రిప్టోకరెన్సీలు, ఇతర డిజిటల్ ఆస్తుల లావాదేవీలపై వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించారు. దీంతో పాటు పరిమితికి మించిన లావాదేవీలపై ఒక శాతం టిడిఎస్(టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) విధించాలని కూడా ప్రతిపాదించారు. టిడిఎస్కి సంబంధించిన నిబంధనలు 2022 జూలై 1 నుండి అమల్లోకి వస్తాయి.
అయితే క్రిప్టోపై పన్ను ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుంది. బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, క్రిప్టోకరెన్సీలపై ప్రభుత్వం వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతోందని, దాని నుండి వచ్చే తీర్మానాల ఆధారంగా జాతీయ విధానం, నియంత్రణను సిద్ధం చేస్తామని అన్నారు. క్రిప్టోకరెన్సీ ఆదాయంపై 30 శాతం పన్ను, పరిమితికి మించిన లావాదేవీలపై 1 శాతం టిడిఎస్ విధించాలని కూడా ప్రతిపాదించారు.
క్రిప్టోకరెన్సీల చట్టబద్ధతపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిబిడిటి) చైర్మన్ జెబి మోహపాత్ర కీలక ప్రకటన చేశారు. క్రిప్టోకరెన్సీలు లేదా డిజిటల్ ఆస్తులపై పన్ను చెల్లించినంత మాత్రాన ఈ వ్యాపారం చేయడం చట్టబద్ధం కాదని ఆయన పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీల కోసం జాతీయ స్థాయిలో పాలసీని రూపొందించే పని జరుగుతోందని సిబిడిటి చీఫ్ తెలిపారు.
పెట్టుబడి తప్పు మార్గంలో ఉందా? లేదా చట్టవిరుద్ధమైందా? అని తెలుసుకోవడానికి కూడా పన్ను విధానం తమకు దోహం చేస్తుందని అన్నారు. లెక్కలో చూపని ఆదాయం లేదా అది వేరొకరి ’బినామీ’ ఆస్తి అయితే తదుపరి చర్యలు ఉంటాయని వివరించారు.
తాజా బడ్జెట్లో క్రిప్టోకరెన్సీలు లేదా ఆన్లైన్ డిజిటల్ ఆస్తులు పన్ను పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వెనుక గల కారణాల గురించి మోహపాత్ర సమాచారాన్ని అందించారు. ఆయన చెప్పిన ప్రకారం, ఇది దేశంలో క్రిప్టో వ్యాపారం ఎలాంటిదో తెలుసుకోవడానికి, పెట్టుబడిదారులను, వారి పెట్టుబడుల స్వభావాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.
ఈ చర్య క్రిప్టోకరెన్సీలలో లావాదేవీలు చట్టబద్ధం అవుతాయని అర్థం కాదు. పన్ను అధికారులు ఈ రంగంలోకి దిగేందుకు ఇదే సరైన సమయమని ఆయన అన్నారు. ఏ లావాదేవీ చట్టబద్ధతపై శాఖ నిర్ణయం తీసుకోదు, ఐటి శాఖ పన్ను చట్టం ఆదాయాన్ని ఆర్జించాయా లేదా అని మాత్రమే చూస్తాయి.