ఉద్యోగులు చేస్తోన్న ఉద్యమానికి జనసేన పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉద్యోగులను రెచ్చగొట్టేలా ఉంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
ఉద్యోగులపై అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. తమ సమస్యల పరిష్కారం కోసమే ఉద్యోగులు పోరాడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు అనేక హామీలిచ్చారని గుర్తు చేశారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని నమ్మించారని ధ్వజమెత్తారు.
జీతాలు పెంచాల్సిన ప్రభుత్వం తగ్గించడమేంటని ఆయన ప్రశ్నించారు. జగన్ చేసిన మోసం వల్లే ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారని ఆయన విమర్శించారు. పోరాటానికి రాజకీయ పార్టీల అవసరం లేదని ఉద్యోగులు ప్రకటించారని గుర్తు చేస్తూ, అందువల్లే తాను ఇంతకాలం వీటిపై మాట్లాడలేదని ఆయన తెలిపారు.
ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపవలసి రావడం పట్ల విచారం వ్యక్తం చేశారు. అనేకమందిని అరెస్టు చేసి కొన్ని చోట్ల లాఠీచార్జ్ చేశారని ఆయన ఆరోపించారు. చర్చల పేరుతో గంటల తరబడి నిరీక్షించేలా చేసి అవమానించారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పవన్ డిమాండ్ చేశారు.