కేంద్ర బడ్జెట్లో ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల కోసం రూ.10,080 కోట్లు కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,032 కోట్లు (గత ఏడాది కంటే 21 శాతం అధికం), తెలంగాణ రాష్ట్రానికి రూ.3,048 కోట్లు (గత ఏడాది కంటే 26ు అధికం) కేటాయించినట్లు వెల్లడించారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నూతన రైల్వే లైన్లు, డబ్లింగ్, విద్యుద్దీకరణ, ట్రాఫిక్ పనుల కోసం బడ్జెట్లో రూ.9,125 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గత ఏడాది రూ.7,049 కోట్లు కేటాయించగా ఈసారి దాదాపు 30 శాతం అదనంగా కేటాయించడం విశేషమని పేర్కొన్నారు.
ఆంధ్రకు కేటాయించిన మొత్తంలో నడికుడి-శ్రీకాళహస్తి(309 కి.మీ) కొత్త రైల్వే ప్రాజెక్టు పనుల కోసం రూ.1,501 కోట్లు, కోటిపల్లి-నర్సాపూర్ కొత్త లైనుకు రూ.358 కోట్లు, కడప-బెంగళూరు లైనుకు రూ.289 కోట్లు, విజయవాడ-గూడూరు 3వ లైను ప్రాజెక్టు కోసం రూ.1,000 కోట్లు కేటాయించారు.
అలాగే విజయవాడ-గుడివాడ, మచిలీపట్నం-భీమవరం, నర్సాపూర్-నిడదవోలు డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు రూ.1,681 కోట్లు, గుంటూరు-గుంతకల్ డబ్లింగ్‌కు రూ.803 కోట్లు, గుత్తి-ధర్మవరం డబ్లింగ్‌కు రూ.100 కోట్లు, ధర్మవరం-పాకాల సెక్షన్ మధ్య విద్యుదీకరణకు రూ.131 కోట్లు, నంద్యాల-ఎర్రగుంట్ల సెక్షన్లో విద్యుదీకరణ కోసం రూ.51 కోట్లు కేటాయించారు.
ఇక కర్నూలు మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ ఫ్యాక్టరీకి రూ.58 కోట్లు, తిరుపతి రైల్వే స్టేషన్లో దక్షిణం వైపు ప్రవేశద్వారం అభివృద్ధికి రూ.3 కోట్లు, తిరుచానూరు స్టేషన్ అభివృద్ధికి రూ.6.5 కోట్లు కేటాయించినట్లు జీఎం వివరించారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని లెవల్ క్రాసింగ్, బిడ్జిలు ఆర్ఓబీ, ఆర్యూబీ నిర్మాణాలకు మొత్తం కలిపి రూ.758 కోట్లు, ట్రాఫిక్ పునరుద్ధరణ పనులకు రూ.1,040 కోట్లు, ‘కవచ్’ కోసం రూ.54 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
కాజీపేట-విజయవాడ 3వ లైన్ ప్రాజెక్టుకు రూ.592.5 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర పరిధిలోని విజయవాడ (19.5 కి.మీ.), కాజీపేట (10.65 కి.మీ.), రేణిగుంట (9.6 కి.మీ.), వాడి (7.6 కి.మీ.), గుత్తి (3.8 కి.మీ.) వద్ద బైపాస్ లైన్లకు రూ.407.47 కోట్లు, జోన్ మొత్తాన్నీ కవర్ చేస్తూ 473 కి.మీల మేర అకోలా-ఖాండ్వా-రాట్లం మధ్య గేజ్ మార్పిడి ప్రాజెక్టు కోసం రూ.888 కోట్లు కేటాయించారు.
వాల్తేరు రైల్వే డివిజన్‌కు రూ 2,553 కోట్లు
2022-2023 కేంద్ర బడ్జెట్లో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు, తూర్పు కోస్తా రైల్వేలోగల రాయగడ డివిజన్ కోసం రూ.40 లక్షలు కేటాయింపు జరిగినట్లు రైల్వే డిఆర్ఎం అనూప్‌కుమార్ శతపతి తెలిపారు. వాల్తేరు డివిజన్‌కు 2,552.812 కోట్లు కేటాయింపు జరిగిందని, ఈ నిధులతో కొన్ని కీలక ప్రాజెక్టులు పూర్తికానున్నాయని చెప్పారు.
దీంట్లో కొత్త లైన్ల కోసం రూ.117.8 కోట్లు, రైల్వే డబ్లింగ్ పనుల కోసం రూ.2162.5 కోట్లు నిధులు కేటాయించినట్లు తెలిపారు. 2021-22 బడ్జెట్లో ఈ డివిజన్‌కు రూ.1192.6868 కోట్లు మాత్రమే కేటాయింపు జరిగిందని పేర్కొన్నారు. కొత్త రైళ్ల కోసం ఈ బడ్జెట్లో వాల్తేరు డివిజన్‌కు ఏమి ఇచ్చారన్న సమాచా రంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు.
వందేభారత్ రైళ్లలో విశాఖకు కచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఈ డివిజన్లో కొత్త రైల్వే లైన్ల కింద జైపూర్-మల్కాన్‌గిరి 130 కిలోమీటర్లు, జైపూర్-నవరంగపూర్ 138 కిలోమీటర్లు, నౌపడ బ్రాడ్‌గేజ్ 79 కిలోమీటర్లు, విజయనగరం-కొత్తవలస మూడోలైన్ కోసం నిధులు వచ్చాయని తెలిపారు.
డబ్లింగ్ లైన్ పనులు పూర్తయితే దేశంలో కార్గో హేండ్లింగ్లో వాల్తేరు రైల్వే ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి వస్తుందని పేర్కొన్నారు. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను సరైన సమయంలో విడుదల చేస్తామని చెప్పారు.