శ్రీరామానుజాచార్యుల బోధనలు ఎప్పటికీ అనుసరణీయమైనవని, ఆయన చేసిన బోధనల సారాన్నే తమ ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మారుతున్న భారతావనిలో ప్రతి ఒక్కరూ సమానంగా, ఒకే విధమైన ప్రయోజనం, గౌరవం పొందాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, ఈ రకమైన విధానం ఉండాలనే రామానుజాచార్య వెయ్యేళ్ల క్రితమే సందేశం ఇచ్చారని ఆయన చెప్పారు.
శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల (సమతా మూర్తి) విగ్రహాన్ని శనివారం సాయంత్రం జాతికి అంకితం చేస్తూ సమాజంలో అణచివేతకు గురైన వర్గాలను రామానుజాచార్యులు ఎంతో ప్రత్యేకంగా గౌరవించారని, పుట్టిన జాతి వల్ల కాకుండా గుణం వల్ల గౌరవం లభించాలని, మానవులంతా సమానమేనని ఆయన చెప్పారని గుర్తు చేసారు.
రామానుజుల వారు 11వ శతాబ్దంలోనే మానవ కల్యాణం గురించి ఆలోచించారని, మూఢ విశ్వాసాలను పారద్రోలి, భక్తికి కులం, జాతితో సంబంధం లేదని, అంతా సమానమేనని చాటి చెప్పారని ప్రధాని చెప్పారు. రామానుజుల వారి సమతా సూత్రం మన రాజ్యాంగానికి స్ఫూర్తి అని, ప్రాచీన కాలంలోనే కులం, జాతి భేదాలు ఉండకూడదని చాటిన సమాతా మూర్తి రామానుజులు అయితే, ఆధునిక భారతంలో అమానతల నివారణకు కృషి చేసిన గొప్ప మనిషి అంబేద్కర్ అని ప్రధాని తెలిపారు.
కాగా, ప్రధాని మోదీ సమాతా మూర్తి విగ్రహావిష్కరణకు ముందు విశ్వక్సేనేష్టి యాగం చేశారు. సంకల్పం సిద్ధి కోసం చేసే ఈ యాగ ఫలితం యావత్ భారతీయులందరికీ దక్కాలని తాను ఆకాంక్షిస్తున్నాని ఆయన చెప్పారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన 108 దివ్య క్షేత్రాల (108 దివ్య దేశాలు) దర్శనం.. దేశమంతా తరిగి ఆయా ఆలయాలను దర్శించిన అనుభూతిని కలగించిందని తెలిపారు.
వసంత పంచమి రోజున రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇంతటి విశాలమైన భారతావనిలో మానవతా విలువలకు ప్రేరణగా నిలిచే మూర్తిగా రామానుజులు ఇక్కడ ప్రతిష్టించడం నవ తరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని సూచించారు.
హైదరాబాద్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తొస్తారని చెబుతూ హైదరాబాద్ స్వేచ్చ, విముక్తి కోసం సర్దార్ పటేల్ కృషి చేశారని ప్రధాని గుర్తు చేశారు సర్దార్ పటేల్ విగ్రహం ఐక్యతకు చిహ్నంగా నిలిస్తే.. రామానుజాచార్యుల విగ్రహం సమానత్వానికి ప్రతీకగా స్ఫూర్తిని నింపుతుందని ఆయన చెప్పారు.
తెలంగాణ పర్యాటకంగా ఎంతగానో ఎదుగుతోందని, రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కిందని మోదీ తెలిపారు. పోచంపల్లికి ప్రపంచ పర్యాటక గ్రామంగా గుర్తింపు లభించిందని చెబుతూ ఇక సమాతా మూర్తి కేంద్రం కూడా పర్యాటకంగా గొప్పగా నిలవబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు తెలుగు సినిమా రంగం కూడా ప్రపంచ వ్యాప్తంగా కీర్తిని గడిస్తోందని, వెండి తెర మొదలు ఓటీటీల వరకు తెలుగు వాళ్లు సత్తా చాటుతున్నారని ప్రధాని కొనియాడారు.