కరోనా మహమ్మారికి గురయిన ప్రజలు వైద్యంకోసం భారీగా ఖర్చు పెట్టవలసి రావడంతో అనేక కుటుంబాలు తీవ్రమైన ఆర్ధిక ఇక్కట్లలో చిక్కుకు పోగా, ప్రభుత్వం చేపట్టిన కరోనా కట్టడి చర్యల ను అరికట్టేందుకు చర్యల కారణంగా పెద్దసంఖ్యలో ఉపాధి కోల్పోవడంతో మరి అనేక ఆర్ధిక సమస్యలు తలెత్తుతున్నాయి.
వీటన్నింటికి మించి, కేవలం కరోనా న్రిధారణ టెస్ట్ ల కోసమే ప్రజలు భారీగా ఖర్చు పెట్టవలసి వస్తున్నదని ఒక అధ్యయనం వెల్లడిస్తున్నది. కరోనా లక్షణం ఏ ఒక్కటి కనిపించినా ప్రజలు తీవ్ర ఆందోళనతో కరోనా పరీక్షా కేంద్రాలకు పరుగులు పెట్టారు. వాటిపై చెప్పుకోదగిన నియంత్రణ లేకపోవడంతో ప్రజల ఆందోళనలను ఆసరా చేసుకొని పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు.
ఇలా గడచిన రెండేళ్లలో కరోనా టెస్టుల కోసమే దేశవ్యాప్తంగా ప్రజలు రూ.74 వేల కోట్లు ఖర్చు చేసినట్లు గ్రాహక్ భారతి అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. వీటిల్లో దాదాపు 74 కోట్ల టెస్టులను ఎటువంటి అనుమతి లేని ప్రైవేటు ల్యాబ్‌లే చేశాయని తెలిపింది.
ఇది దేశప్రజలు దోపిడీ చేయడమే అని స్పష్టం చేస్తూ, ఈ దోపిడీపై లోతయిన దర్యాప్తు జరపాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య, కుటుంభం సంక్షేమ మంత్రి మనసుఖ్ మాండవీయ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే లతో పాటు ఐసిఎంఆర్ వంటి వాంస్తలను గ్రాహక్ భారతి డిమాండ్ చేసింది. లేని పక్షంలో తాము సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించగలమని హెచ్చరించింది.
ప్రభుత్వ అధికారులు, కొన్ని ప్రైవేట్ లాబ్స్, వాటి ఫ్రాంచైస్ దారులు కలసి జరిపిన పెద్ద కుంభకోణం అని ఆరోపిస్తూ, ఇటువంటి నాణ్యతలేని కరోనా టెస్ట్ ల ఆధారంగా వెలువడిన రిపోర్ట్ లను ఆధారంగా చేసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి సంబంధించి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాయని విస్మయం వ్యక్తం చేసింది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తొలి రోజుల్లో చాలా మంది తమకు ఎటువంటి లక్షణాలు లేకపోయినా కరోనా టెస్టు చేయించుకున్నారు. వారి ఆందోళనను ఆసరాగా చేసుకున్న ల్యాబ్‌లు.. ఒక్కో టెస్టుకు రూ.3500 దాకా వసూలు చేశాయి. తరువాత క్రమంగా ఈ ఫీజు తగ్గుతూ వచ్చింది.
ప్రస్తుతం రూ.600 దాకా వసూలు చేస్తున్నారు. ఇంటివద్దే స్వయంగా పరీక్షించుకునే కిట్ రూ.250కే లభిస్తోంది. కాగా సగటున ఈ ఫీజు రూ.1000గా పరిగణిస్తే కరోనా టెస్టుల కోసం భారతీయులు ఇప్పటిదాకా రూ.74 వేల కోట్లు ఖర్చు చేసినట్లు అర్థమవుతోంది.
అయితే ఇప్పటిదాకా చేసిన 74 కోట్ల టెస్టుల్లో 4.20 కోట్లు మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయని గ్రాహక్ భారతి వ్యవస్థాపక అధ్యక్షుడు బారిస్టర్ వినోద్ తివారి తెలిపారు. కరోనా పరీక్షలు జరిపిన మొత్తం 3255 ల్యాబ్‌లలో ప్రైవేటు ల్యాబ్‌లు 1844, ప్రభుత్వ ల్యాబ్‌లు 1411 ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ పరీక్షల వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఆరోపించారు. కొందరు ప్రభుత్వ అధికారుల, రాజకీయ నాయకుల అండతో.. ప్రమాణాలు లేని ల్యాబ్‌లు కూడా రోజుకు వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహించాయని తెలిపారు.
ఈ నెల 4వ తేదీన ఒక్కరోజే ఏకంగా 16,03,856 టెస్టులు చేసినట్లుగా ఐసీఎంఆర్ స్వయంగా వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ ల్యాబ్‌లలో వచ్చే ఫలితాలకు ఎటువంటి ప్రామాణికత ఉండటంలేదని, ఒకే వ్యక్తికి 24 గంటల వ్యవధిలో రెండు రకాల ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి ల్యాబ్‌లపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. లేనిపక్షంలో ప్రజల సొమ్ము మరింత దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.