తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన ఆస్తుల పంపిణీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయంతోనే జరగవలసి ఉన్నట్లు కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. ఈ పంపిణి ఇంకా పూర్తి కాలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ చెప్పారు. రాజ్యసభలో బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తెలంగాణ, ఎపి మధ్య కొన్ని ఆస్తుల విషయంలో సయోధ్య కుదరలేదని తెలిపారు.
ఈ విషయంలో ఇప్పటికే 26 సమావేశాలు నిర్వహించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం ప్రకారం విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 పరిధిలోని సంస్థల ఆస్తుల పంపకం ఎటూ తేలలేదు. అప్పుడప్పుడూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నా అవి తూతూమంత్రంగా మిగిలిపోతున్నాయి తప్ప ఏ ఒక్క సమస్యకు పరిష్కారం లభించడం లేదు.
2019లో ఇరు రాష్ట్రాల సిఎంలు ఇదే అంశంపై ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. కానీ ఈ సమస్యలు పరిష్కారం కాలేదు. సమస్యను అధికారులకు వదిలేశారే తప్ప పరిష్కారమార్గాలకు ప్రయత్నించలేదు. 2020 ఏప్రిల్ 7న కూడా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో సమావేశం జరిగినా ఒక్క సమస్యా పరిష్కృతమవవ్వలేదు.
ఈ నేపథ్యంలో మరోమారు విభఝన సమస్యలపై ఈ నెల 12న సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కేంద్ర హోంశౠఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపింది.
ఇతర రాష్ట్రాల్లోని ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని ఉంది. ఆ ప్రకారం 58ః32ః41ః68 నిష్పత్తిలో ఎపి, తెలంగాణకు ఆ భవనాన్ని పంపిణీ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఈ వాదనను వ్యతిరేకిస్తోంది. ఏపి భవన్ పూర్తిగా తెలంగాణకు చెందుతుందని వాదిస్తోంది.
సిఎం కెసిఆర్ కూడా 2017లో ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. 1956లో హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే నిజాం రాజు ఢిల్లీలో 18 ఎకరాల 18 గుంటల భూమిని కొనుగోలు చేసి భవనాన్ని నిర్మించారని అందులో పేర్కొన్నారు. అందుకే ఆ భవనం తెలంగాణకే చెందుతుందని స్పష్టం చేశారు.
23 సంస్థలపై విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలుపెద్ద చిక్కుముళ్లుగా మారాయి. ఈ షెడ్యూలు కింద మొత్తం 91 సంస్థలున్నాయి. వీటికి సంబంధించి ఉద్యోగుల విభజన పూర్తయింది. ఆస్తులు, అప్పుల సమస్యలు తేలాల్సి ఉంది. 68 సంస్థలకు సంబంధించి పెద్దగా వివాదాల్లేవు. ఇవి దాదాపుగా పరిష్కారమైనట్లే.
మిగిలిన 23 ప్రధాన సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీ కీలకంగా మారింది. ముఖ్యంగా ఆర్టీసీ, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డు, దిల్, పాడి అభివృద్ధి సంస్థ, పరిశ్రమల అభివృద్ధి సంస్థ, పౌరసరఫరాల సంస్థ వంటి 23 సంస్థల ఆస్తులు, అప్పుల సమస్య తెగని పంచాయితీగా మారింది.
కార్పొరేషన్ల హెడ్‌క్వార్టర్ భవనాలను మాత్రమే ఇరు రాష్ట్రాల మధ్య పంచాల్సి ఉందని విభజన చట్టంలోని సెక్షన్ 53 స్పష్టం చేస్తోంది. కానీ ఆయా సంస్థల ఆస్తులన్నింటినీ 58ః32ః41ః68 నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయాలంటూ ఎపి వాదిస్తోంది.
ఆర్టీసీ హెడ్ క్వార్టర్ భవనంగా ఉన్న బస్‌భవన్‌ను మాత్రమే ఇరు రాష్ట్రాల మధ్య పంచాల్సి ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతుండగా, హైదరాబాద్‌లో ఆర్టీసీ కల్యాణమండం, మియాపూర్ బస్‌బాడీ యూనిట్, హిమాయత్‌నగర్ గెస్ట్‌హౌస్ వంటి 14 ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంచాలని ఎపి డిమాండ్ చేస్తోంది.
టూరిజం కార్పొరేషన్‌కు చెందిన పర్యాటక భవన్‌తో పాటు సికింద్రాబాద్‌లోని యాత్రీనివాస్ వంటి ఆస్తులను, నల్లగొండ చౌరస్తాలోని వికలాంగుల సంస్థ ఆస్తులు, భవనాలను పంచాలంటోంది. థిల్ సంస్థకు వివిధ జిల్లాల్లో భూములున్నాయి.
ఉమ్మడి రాష్ట్ర నిధులతో వీటిని కొనుగోలు చేశారని, అందుకే ఆ స్థలాలు, భూముల్లో తమకు వాటా రావాల్సి ఉంటుందనేది ఎపి వాదన. కానీ చట్టంలోని 53 సెక్షన్ ప్రకారం హెడ్‌క్వార్టర్ భవనాలను మాత్రమే పంచాలని తెలంగాణ వాదిస్తోంది.
మరోవైపు తెలంగాణ తమకు రూ.6,112 కోట్ల విద్యుత్తు బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. కానీ ఎపి ప్రభుత్వమే తమకు రూ.1,675 కోట్ల బకాయి ఉందని తెలంగాణ వాదిస్తోంది. ఈ సమస్య ఎటూ తేలడం లేదు. విభజన చట్టంలోని 10వ షెడ్యూలు కింద ఉన్న సంస్థల కథ వేరుగా ఉంటుంది.
వీటిలో కూడా ఉద్యోగుల పంపిణీ పూర్తయినా ఆస్తుల సమసయ కొలిక్కి రావడం లేదు. ఈ షెడ్యూలు కింద యూనివర్సిటీలు, ఎంసిహెచ్ఆర్డీ, తెలుగు అకాడమీ వంటి సంస్థలు, సొసైటీలు ఉన్నాయి. వీటికి అప్పుల సమస్య లేదు. విభజన చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం ఎక్కడి సంస్థలు ఆ రాష్ట్రానికే చెందుతాయి.