అభివృద్ధిలో భాగమైన రైల్వే లైన్ల నిర్మాణం, విస్తరణలపై ఎపి ప్రభుత్వానికి ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ విమర్శించారు. రైత్వే మంత్రిత్వశాఖ ఇచ్చిన వివరణతో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల్లో ఎందుకు జాప్యం జరిగిందో తెలుస్తోందని,వైసిపి ప్రభుత్వ వైఖరి తేటతెల్లమైందని ధ్వజమెత్తారు.
“నిధులు ఇవ్వరు.. భూసేకరణ కూడా చేయరు. రాష్ట్ర ప్రభుత్వం తన భాధ్యతను విస్మరిస్తే రైల్వే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి? మౌలిక వసతుల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? ఇలాగైతే ఆయా లైన్లు ఎప్పటికి పూర్తవుతాయి? ” అని ఆయన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.
రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పూర్తి కావచ్చిన ప్రాజెక్టులు ఎపి ప్రభుత్వ అలసత్వంతోనే జాప్యం అవుతున్నాయని సోషల్ మీడియా పోస్ట్ లో ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సమకూర్చాల్సిన నిధులను విడుదల చేయకపోతే పనులు ఎలా సాగుతాయని పవన్ ప్రశ్నించారు.
”కీలకమైన రైల్వే లైన్లు అసంపూర్తిగా ఉండిపోయాయి. కోటిపల్లి ానరసాపురం రైల్వేలైన్ అనేది ఎప్పటి నుంచో వింటున్నదే. ఈ ప్రాజెక్టుకు 25శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ఆమొత్తాన్ని ఇవ్వకపోవడంతో పనులు ముందుకెళ్లడం లేదు” అని విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.358 కోట్లు ఇస్తే పనులు మొదలవుతాయని చెబుతూ ఈరైల్వే లైన్ పూర్తి చేస్తే ఉభయగోదావరి జిల్లాలలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీంతోపాటు నడికుడిా-శ్రీకాళహస్తి ప్రాజెక్టుకు రూ.1351 కోట్లు, కడప- బెంగళూరు లైన్‌కు రూ.289 కోట్లు., రాయదుర్గం- తుమకూరు లైన్‌కు రూ.34 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉన్నదని వివరించారు.
రాష్ట్రంలో రైల్వేలైన్ల పూర్తికి ఆశాఖ మంత్రి చెప్పిన సమాధానంలోని అంశాలను సీఎంకు వివరించి రాష్ట్ర వాటా నిధులను విడుదల చేయాల్సిన భాధ్యత వైసిపి ఎంపీలపై ఉందని పవన్ చెప్పారు. విశాఖ రైత్వే జోన్ ప్రకటన పూర్తయినా అది కార్య రూపం దాల్చేలా చేయడంలో ఎంపీలు విఫలమవుతున్నారని ధ్వజమెత్తారు. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయించలేరు.. ప్రకటించిన జోన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని పవన్ విమర్శించారు.