దైవ దర్శనం అన్ని వర్గాలకు చేరువ కావాలని రామానుజాచార్యులు నమ్మారని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. బడుగు వర్గాలకు దైవ దర్శనం ప్రాప్తి కోసం రామానుజాచార్యులు కృషిచేశారని కొనియాడారు. ఈశ్వరాధాన చేయడానికి అన్ని వర్గాలకు హక్కు ఉంటుందని చెప్పారని పేర్కున్నారు.
భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమతామూర్తి కేంద్రంలో ఏర్పాటు చేసిన 120 కిలోల బంగారు రామానుజాచార్యుల ప్రతిమను లాంఛనంగా ఆయన ఆవిష్కరించారు. వేద పండితులు నిర్ణయించిన మూహుర్తానికి స్వర్ణమూర్తిని రాష్ట్రపతి లోకార్పణం చేశారు. సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముచ్చింతల్ చేరుకున్నారు. విహంగ వీక్షణంలో సమతామూర్తి కేంద్రాన్ని తిలకించారు.
ఈ సందర్భంగా రామానుజుల స్వర్ణమూర్తి నెలకొల్పి చినజీయర్‌స్వామి చరిత్ర లిఖించారని అభినందించారు. రాష్ట్రపతి రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలిపారు. రామానుజుల స్వర్ణమూర్తి లోకార్పణం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు.
ముచ్చింతల్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీరామనగరం అద్వైత.. సమతా క్షేత్రంగా విరాజిల్లుతుందని తెలిపారు. రామానుజులు సామాజిక అసమానతలు రూపుమాపారని పేర్కొంటూ ప్రజల్లో భక్తి.. సమానత కోసం రామానుజులు కృషిచేశారని రాష్ట్రపతి కొనియాడారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో తన సందేశాలతో చైతన్యం నింపారని,. రామానుజాచార్యులు విశిష్ట అద్వైత సిద్ధాంతాలు బోధించారని గుర్తు చేశారు.
దైవభక్తి ద్వారా ప్రజలకు ముక్తి లభిస్తుందని చాటి చెప్పారని తెలిపారు. సాంస్కృతిక విలువల ఆధారంగా దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చారని చెబుతూ శ్రీరంగం..కాంచీపురం.. వారణాసి నుంచి తన సిద్ధాంతాలు విశ్వవ్యాప్తం చేశారని రామ్ నాథ్ పేర్కొన్నారు. భారత్‌లో భక్తి మార్గం దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లిందని అంటూ ఉత్తర భారత్ సాధువులు రామానుజుల సిద్ధాంతాలతో ప్రభావితం అయ్యారని రాష్ట్రపతి వివరించారు.
ముచ్చింత్ లోని జీవాశ్రమంలో రాష్ట్రపతి దంపతులకు చినజీయర్ స్వామితోపాటు జూపల్లి రామేశ్వర్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. అనంతరం సమతామూర్తి కేంద్రానికి చేరుకున్న రామ్ నాథ్ కోవింద్ కు భద్రవేది మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో స్వర్ణమూర్తి ప్రత్యేకతలను చినజీయర్ స్వామి వివరించారు. ఆ తర్వాత నిర్దేశించిన మూహుర్తానికి 3.56 నిమిషాలకు రాష్ట్రపతి…. స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
సమతామూర్తి స్వర్ణ ప్రతిమకు తొలి హారతి ఇచ్చారు. చినజీయర్ స్వామి బంగారు శఠారితో రాష్ట్రపతి కుటుంబసభ్యులను ఆశీర్వదించారు. ఆ తర్వాత స్వర్ణమూర్తి విగ్రహా ఏర్పాటుకు గుర్తుగా ఏర్పాటు చేసిన శిలఫలకాన్ని రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించారు.
భద్రవేది మూడో అంతస్తులో కొలువైన బృహాన్ మూర్తిని దర్శించుకున్నారు. సమతామూర్తి సన్నిధిలో ఏర్పాటు చేసిన 108 దివ్యదేశాల విశిష్టతలను చినజీయర్ స్వామి రాష్ట్రపతి దంపతులకు వివరించారు. సమతా మూర్తి నుండి ప్రవచన మందిరానికి చేరుకున్నారు. ప్రవచన మందిరం లో రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రసంగం తరువాత ముచ్చింతల్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో బేగం పెట్ ఎయిర్ పోర్ట్ బయలు దేరి వెళ్లారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళిసై ఈ వేడుకలో పాల్గొన్నారు.