ఆర్జెడి అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రపాద్ దాణా కుంభకోణంలోని ఐదో కేసులో కూడా సిబిఐ కోర్టు దోషిగా ప్రకటించింది. 1990, 1995 మధ్యకాలంలో డోరాండా ట్రెజరీ నుండి రూ.139.35 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేశారంటూ లాలూపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
దాణా కుంభకోణంలో ఇది ఐదవ కేసు, అతిపెద్ద కేసు. తాజా తీర్పుతో పశుదాణా కుంభకోణానికి చెందిన మొత్తం ఐదు కేసుల్లోనూ లాలూ దోషిగా నిలిచారు. న్యాయమూర్తి సికె. శశి తీర్పును వెలువరించే సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీ కోర్టులోనే ఉన్నారు.
ఈ కేసులో 98 మంది ఇతర నిందితులు కూడా కోర్టుకి హాజరయ్యారు. వీరిలో 24 మందిని నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. మాజీ ఎంపి జగదీష్ శర్మ, అప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) చైర్మన్ ధ్రువ్ భగత్‌లతో పాటు 35 మందికి మూడేళ్ల జైలుశిక్ష విధించింది. బెయిల్‌కి వారికి అర్హత లభించింది.
ఈ కేసులో దోషులుగా నిర్ధారణ అయిన లాలూ సహా 39 మంది శిక్షాకాలాన్ని ఈనెల 21న కోర్టు ప్రకటించనుంది. పశు దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగు కేసుల్లో లాలూ ఇప్పటికే దోషిగా నిర్ధారణ అయ్యారు. అబే చైబాసా ట్రెజరీ నుండి 37.7 కోట్ల రూపాయలను విత్‌డ్రా చేసిన మొదటి కేసులో లాలూ ప్రసాద్‌కు 5 ఏళ్ల శిక్ష పడింది.
దేవఘర్ ట్రెజరీ నుంచి నిధుల ఉపసంహరణ కేసులో మూడున్నరేళ్లు శిక్ష, చైబాసా ట్రెజరీ నుండి 33.13 కోట్లు అక్రమంగా ఉపసంహరించుకున్న మూడవ కేసులో 5 సంవత్సరాల శిక్ష పడింది. దుమ్కా ట్రెజరీ నుంచి 3.76 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేయడంపై నాలుగో కేసులో రెండు వేర్వేరు సెక్షన్లలో 7 – 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ నాలుగు కేసులను సవాలు చేశారు. దుమ్కా కేసులో హైకోర్టు నుండి లాలూ ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యారు.