బెల్జియంలో వారానికి నాలుగు రోజులు మాత్రమే పని విధానంను అమలులోకి తీసుకు రాబోతున్నారు. ఆ దేశ ప్రధాని అలెగ్జాండర్ డి క్రూ ఇటీవల ప్రకటించారు. వర్కింగ్ అవర్స్ ముగిసిన తర్వాత ఇక ఆఫీస్ పని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని కూడా వెల్లడించారు.
ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. దీంతో ఉత్పాదకత మరింత మెరగయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ”కరోనా మహమ్మారి దృష్ట్యా పరిస్థితులకు అనుగుణంగా పని చేయాల్సిన అవసరం ఏర్పడింది. లేబర్ మార్కెట్ కూడా ఈ విధానాన్ని అలవాటు చేసుకోవాలి” అని మంత్రివర్గంలో చర్చ అనంతరం బెల్జియం ప్రధాని మీడియాతో తెలిపారు.
ప్రజల జీవన నాణ్యతా ప్రమాణాలను మెరుగుపర్చడంతో పాటు ఉత్తమమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను అందించేందుకు ఈ చర్యలు దోహదపడతాయని తెలిపారు. నూతన విధానం ప్రకారం.. ఒక ఉద్యోగి వారానికి ఐదు రోజులు కాకుండా, నాలుగు రోజుల్లో 38 గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. అంటే రోజుకు 9.30 గంటలు విధులు నిర్వహించాలి.
నాలుగు రోజుల్లో ఎక్కువ గంటలు పనిచేసినప్పటికీ.. వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటంతో ఉద్యోగులు రీఫ్రెష్ అయ్యేందుకు అవకాశం ఉంటుందని, దీంతో మరుసటి వారానికి ఉద్యోగులు ఉత్సాహంగా ఆఫీసులకు వస్తారని బెల్జియం ప్రభుత్వం భావిస్తోంది.
ఇక నాలుగు రోజుల పనితో పాటు వర్కింగ్ అవర్స్ ముగిసిన తర్వాత ఆఫీస్ వర్క్‌కు సంబంధించిన పరికరాలను ఆఫ్ చేసేలా ఉద్యోగులకు వెసులుబాటు కల్పించనున్నారు. పని గంటల తర్వాత ఆఫీస్ నుంచి పనికి సంబంధించిన మెసేజ్‌లు, కాల్స్ వస్తే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదట.
ఇది ఉద్యోగుల హక్కుగా పరిగణించనున్నారు. ప్రస్తుతానికి ఈ విధానానికి సంబంధించిన ముసాయిదా బిల్లును రూపొందించారు. దీనిపై ప్రజల, నిపుణుల నుంచి సలహాలు, సూచనలు సేకరించిన తర్వాత తుది బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మధ్య నాటికి ఈ కొత్త పని విధానాన్ని అమల్లోకి తెచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఇప్పటికే కొన్ని దేశాలు ఈ నాలుగు రోజుల పని దినాలను ప్రయోగాత్మకంగా చేపట్టాయి. స్కాట్లాండ్ గతేడాది సెప్టెంబరులో వారానికి నాలుగు రోజుల పని దినాలను ట్రయల్‌గా ప్రారంభించగా.. ఐస్‌ల్యాండ్, స్పెయిన్, జపాన్ కూడా ఈ విధానాన్ని పరిశీలించాయి.
ఈ దిశగా ఇప్పటికే చాలా దేశాలు అడుగులు వేశాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గతేడాది డిసెంబరులోనే నాలుగు రోజుల పని విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా కూడా రికార్డుల్లో నిలిచింది.